సాక్షి, అమరావతి : ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈనెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 10.35 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్మహ్యణ్యంకు నోట్ వచ్చింది. దీనిని ఆయన సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లికి పంపించారు. ఈ అంశం సచివాలయంలోని అఖిల భారత సర్వీసు (ఐఏఎస్) సీనియర్ అధికారుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల నిబంధనావళి అమలులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించడం సహేతుకమేనా? అసలు ఈ సమావేశం జరుగుతుందా? జరగదా? అనే అంశాలు ప్రస్తుతం ఐఏఎస్‌ల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈనెల 10న కేబినెట్ సమావేశం జరుగుతుందా? జరగదా? అని సీనియర్ ఐఏఎస్ అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా జరిగే అవకాశం లేనేలేదని కుండబద్దలు కొట్టారు. సీఎం తీసుకున్న నిర్ణయం సమంజసమైనది కాకపోవడం, నిబంధనలను పాటించకపోవడమే ఇందుకు కారణాలని వారు విశ్లేషిస్తున్నారు.
మంత్రివర్గ సమావేశం పెట్టాలంటే..
సాధారణ పరిస్థితుల్లో కేబినెట్ సమావేశాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎం పెట్టుకోవచ్చు. సీఎం ఆదేశం ప్రకారం ఫలానా తేదీన కేబినెట్ సమావేశానికి చర్యలు తీసుకోవాలని సీఎంఓ నోట్ పంపితే.. సీఎస్ దానిని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శికి పంపుతారు. జీఏడీ అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు పంపించి అజెండా కోరాలి. ఆ శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు అజెండా రూపొందించి సంబంధిత మంత్రులకు పంపాలి. ఆర్థికపరమైన అంశాలు ఉంటే ఆ శాఖ అనుమతి తీసుకోవాలి. ఇలా వచ్చిన ప్రతిపాదనలను సీఎం ఆమోదం నిమిత్తం పంపుతారు. ఇది సాధారణ పరిస్థితుల్లో జరిగే ప్రక్రియ. అయితే, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేబినెట్ సమావేశం పెట్టాలంటే కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) ముందస్తు అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం కోడ్ ఉన్న సమయంలో అత్యవసరమై కేబినెట్ సమావేశం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? దీని ఉద్దేశాలేమిటి? ఏయే అజెండా అంశాలు పెట్టదలిచారో వివరంగా పేర్కొనాలి.
అందులో ఏయే నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు? అనే వివరాలను కూడా వివరిస్తూ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి లేదా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. సీఎంఓ నుంచి వచ్చిన నోట్ ప్రకారం జీఏడీ నివేదిక రూపొందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించాలి. సీఎస్ దానిని రాష్ట్ర సీఈఓ లేదా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించాలి. దీనిని కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వినతి సహేతుకమని, అత్యవసరంగా కేబినెట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని కమిషన్ భావిస్తే అనుమతిస్తుంది.. లేదంటే తిరస్కరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం (సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి) నుంచి వచ్చే లేఖను పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి సీఈసీ కనీసం 48 గంటలు అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ లేఖ చేరిన తర్వాత కమిషన్ సభ్యులంతా కూర్చుని అందులోని అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర సర్కారు నుంచి వచ్చిన వినతికి అదనపు సమాచారం అవసరమైతే ఆ వివరాలు పంపాలని కూడా కమిషన్ కోరవచ్చు. అత్యవసరంగా కేబినెట్ పెట్టాల్సిన అవసరంలేదని భావిస్తే రాష్ట్ర సర్కారు విజ్ఞప్తిని తిరస్కరించవచ్చు.
సీఎంఓ నోట్‌లో ఏముంది?
‘ఈ నెల 10న కేబినెట్ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు ఏర్పాట్లు చేయండి.. అని మాత్రమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎంఓ పంపిన నోట్‌లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం పెట్టాల్సిన అత్యవసరం ఏమిటి? ఏఏ అంశాలు చర్చించాలి? కేబినెట్‌లో ఏఏ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు? అనే వివరాలు రేఖామాత్రంగా కూడా అందులో లేవు. అందువల్ల కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపడానికి వీలుగా జీఏడీ నివేదిక రూపొందించాలంటే ఈ నోట్ ప్రకారం వీలుకాదు. ఇందులోని అంశాల ప్రకారమే జీఏడీ లేఖ పంపితే సీఎస్ ఆమోదించి కమిషన్‌కు పంపినా కమిషన్ ఆమోదించే ప్రశ్నే ఉండదని ఎన్నికల నిబంధనలపై సాధికారత ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి తెలిపారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించడంలో ఏమాత్రం హేతుబద్ధత లేదు. ఎందుకు సమావేశం పెట్టాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావడంలేదు. సీఎం మాటలను బట్టి చూస్తే అధికారులను బెదిరించడానికే పెట్టాలనుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
కేబినెట్ సమావేశం పెడతా? ఎవరు అడ్డుకుంటారో? చూస్తా. సమావేశానికి రాని అధికారులపై బిజినెస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటా’ అంటూ సీఎం బెదిరింపు ధోరణిలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనాలని పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ‘సాక్షి’తో అన్నారు. రాజ్యాంగబద్ధమైన సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా ఎన్నికల కమిషన్‌ను చులకన చేసేలా, అధికారులను బెదిరించేలా మాట్లాడటం ఏమాత్రం వాంఛనీయం కాదని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సాధారణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేబినెట్ సమావేశం పెట్టదు. ఇలా పెట్టిన సంప్రదాయం మన రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. పైపెచ్చు ఇలాంటి అత్యవసరం కూడా ఉత్పన్నం కాలేదు. అయినా సీఎం పట్టుబట్టి సమావేశం నిర్వహించాలనుకోవడం వెనుక ఏదో రహస్య అజెండా ఉన్నట్లుంది’.. అని ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులేవి?
‘తుపానులు, కరువు కాటకాలు వంటి విపత్తులు సంభవిస్తే తప్ప ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించరాదు. ఒకవేళ సీఎం ఆహ్వానించినా అధికారులు సమావేశాలకు హాజరుకారాదు. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు అని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో నిబంధనలు విస్పష్టంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం పెడతామంటే ఎన్నికల కమిషన్ ఎలా ఆమోదిస్తుంది’ అని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా అసాధారణ పరిస్థితులు లేవు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఫొని తుపాను సంభవించినా.. అక్కడ రెండో రోజునే సీఎస్ నేతృత్వంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి అని ఆయన గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment