45 రోజుల్లో కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక | Cabinet sub-committee submits to give report on TDP Govt corruption in 45 days | Sakshi
Sakshi News home page

45 రోజుల్లో కేబినెట్‌ సబ్‌ కమిటీ ప్రాథమిక నివేదిక

Published Sun, Jun 30 2019 6:03 PM | Last Updated on Sun, Jun 30 2019 8:21 PM

Cabinet sub-committee submits to give report on TDP Govt corruption in 45 days - Sakshi

సాక్షి, అమరావతి : గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి ప్రతి అంశంపైనా కేబినెట్‌ సబ్‌ కమిటీ విచారణ చేపట్టనున్నట్లు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆదివారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కేబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యులు సుమారు రెండు గంటల పాటు సమావేశం అయ్యారు. భేటీ అనంతరం మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ... ప‍్రజా ధనాన్ని కాపాడటమే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. ‘కేబినెట్‌ సబ్‌ కమిటీ కూడా అదే లక్ష్యంగా పనిచేస్తుంది. అవినీతికి సంబంధించి అన్ని అంశాలపై సమావేశంలో సీఎం జగన్‌ చర్చించారు. ప్రజాధనం కాపాడటం, వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 45 రోజుల్లో కమిటీ విచారణ పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 15 రోజులకు ఒకసారి మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. 

చదవండిమంత్రివర్గ ఉప సంఘంతో సీఎం జగన్‌ భేటీ

రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలని ప్రజలు ఆకాంక్షించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో అన్నింటిలోనూ విపరీతమైన అవినీతి జరిగింది. గత అయిదేళ్లలో అవినీతిలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందని స్వచ్ఛంద సంస్థలు నివేదికలు ఇచ్చాయి. ఆ నివేదికల ఆధారంగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అవినీతిని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నెల రోజుల పాలన ఎంతో పారదర్శకంగా ఉంది. సబ్‌ కమిటీ నివేదిక కూడా అంతే పారదర్శకంగా ఉంటుంది. ప్రజలుకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు సంక్షేమం, అభివృద్ధి కూడా ప్రభుత్వ బాధ్యత. జీతాలు పెరగాలంటే రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటిది ముఖ్యమంత్రే స్వయంగా పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.18 వేలు జీతం ఇవ్వాలని ప్రకటించారు.’ అని  మంత్రి కన్నబాబు తెలిపారు.

ఆగస్ట్‌ 1 నుంచి సీఎం ప్రజా దర్బార్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆగస్ట్‌ 1వ తేదీ నుంచి ప్రజా దర్బార్‌ నిర్వహిస్తారని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రైతుల నుంచి రుణాలు వసూలు చేసేందుకు కొన్ని బ్యాంకులు, డీసీసీబీలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అన్నారు. బ్యాంకులు రైతులతో సమన్వయంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఈ మేరకు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడినట్లు చెప్పారు.

అవినీతి జరిగిన అన్ని శాఖల్లోనూ విచారణ
గత అయిదేళ్లలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక అవకతవకలు జరిగాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని అధికారులు వెల్లడించారన్నారు. ప్రాజెక్టులు నిర్మాణాత్మక పనుల్లో ఎక్కువ అవినీతి జరిగిందన్నారు. సెక్రటేరియట్‌లోని వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. అవినీతి జరిగిన అన్ని శాఖల్లోనూ విచారణ జరుపుతామన్నారు. కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలో రాజధాని భూ సేకరణ, భూ కేటాయింపులపై చర్చించినట్లు బుగ్గన తెలిపారు. పారదర్శక పాలనే ప్రభుత్వ ధ్యేయమని, రాజధాని భూములు, భూ కేటాయింపులు, ప్రాజెక్టులు, దోమలపై దండయాత్ర నుంచి ప్రతి పనిలోనూ అవినీతేనని అన్నారు. ఈ విచారణ వల్ల గతంలో జరిగిన అవినీతి బయటపడుతుందని బుగ్గన పేర్కొన్నారు.

కాగా మంత్రివర్గ ఉప సంఘంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పంచాయతీరాజ్, గ్రామీణ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి ఎం.గౌతంరెడ్డి ఉన్నారు. అలాగే ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డిలు ప్రత్యేక ఆహ్వానితులుగా, సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ ఈ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు చేసే సూచనల ఆధారంగా ఉప సంఘం విచారణ సాగనుంది. ఈ విచారణ శాస్త్రీయంగా, పారదర్శకంగా సాగేందుకు వీలుగా ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాల్లోని ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా ఈ ఉప సంఘం ఎలాంటి సమాచారం, జీవోలు, డాక్యుమెంట్లు, ఫైళ్లు కోరినా ఆయా శాఖలు ఇవ్వాల్సి ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement