రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహిస్తున్న సబ్ కలెక్టర్ మహేష్‌కుమార్
సాక్షి, చంద్రగిరి రూరల్(చిత్తూరు): సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ కోడ్‌ను అమలు చేయడంతో చంద్రగిరి నియోజకవర్గ కాల్ సెంటర్‌ను బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సబ్ కలెక్టర్ మహేష్‌కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంపై ఎటువంటి ఫిర్యాదులు, ఓటుకు సంబంధించిన సమాచారం కోసం 0877–2970959 నంబరును సంప్రదించాలని తెలిపారు. మంగళవారం ఆయన తిరుపతిలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ రాజ కీ య పార్టీ ప్రతినిధులతో ఎన్నికల నియమావళిపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ప్రచార అనుమతుల కోసం ఎన్నికల కమిషన్ రూపొందించిన సువిధ యాప్ ద్వారా 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్బన్ ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలని కోరారు. సి విజిల్ యాప్ ద్వారా డబ్బు, వస్తువులు పంపిణీ జరిపితే ఫొటో, వీడియోలు తీసి పెట్టిన వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లు 24 గంటలూ పర్యవేక్షిస్తుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ కిరణ్‌కుమార్, చంద్రగిరి ఏఈఆర్‌ఓ హరికుమార్, డీటీలు ఝాన్సీ, లక్ష్మినారాయణ, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మూడు రోజుల ఓటు నమోదు
ఓటు హక్కు పొందని వారు మరో మూడు రోజుల్లోపు ఓటు నమోదు చేసుకోవాలని తిరుపతి నియోజకవర్గ ఎన్నికల అధికారి, తుడా కమిషనర్ విజయరామరాజు అన్నారు. మంగళవారం ఆయన తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో బ్యాంకు అధికారులు, రాజకీయ పార్టీ నాయకులతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎవరు కూడా రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్లకూడదన్నారు. అంతకు మించి రూ.10 లక్షల వరకు అయితే ఆధారాలు తేలే వరకు ఆ నగదును ప్రభుత్వ ట్రెజరీలో జమచేసి, ఆపై ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పజెబుతామన్నారు.
తిరుపతి నగరంలోని అన్ని బ్యాంకు శాఖల లావాదేవీలపై రోజూవారీ స్టేట్‌మెంట్ ఆర్‌ఓలకు అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందో లేదో సరి చూసుకోవాలన్నారు. ఓటు లేకుంటే మరో 3రోజుల్లోపు ఓటును నమోదు చేసుకునే సౌకర్యాన్ని ఈసీ కల్పించిందన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటింగ్ జరిగేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో తిరుపతి అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసులు, ఈడీటీ విజయభాస్కర్, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment