అవినీతికి కోడెల కుటుంబం బలికాక తప్పదు | Candidates Are Not Available To Contest On Behalf of Corrupt And Illegitimate Telugu Desam Party | Sakshi
Sakshi News home page

అవినీతికి కోడెల కుటుంబం బలికాక తప్పదు

Published Fri, Mar 15 2019 1:15 PM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

Candidates Are Not Available To Contest On Behalf of Corrupt And Illegitimate Telugu Desam Party - Sakshi

ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన 31వ వార్డుకు చెందిన టీడీపీ కార్యకర్తలు

సాక్షి. నరసరావుపేట రూరల్‌: అవినీతి, అక్రమాలతో కూరుకుపోయిన తెలుగుదేశం పార్టీ తరుపున పోటీచేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పవిత్రమైన రాజ్యంగపదవిలో ఉండి సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు, అతని కుటుంబ సభ్యులు సాగించిన అరాచకాలతో ప్రజలు టీడీపీకి బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా కోడెల అవినీతి, అక్రమాలకు బలిపశువు కాకతప్పదని జోస్యం చెప్పారు. పట్టణంలోని 31వ వార్డులో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో గురువారం ‘రావాలి జగన్‌–కావాలి జగన్‌’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి 31వ వార్డు పరిధిలోని విద్యుత్‌ కార్యాలయం, సింధూ స్కూల్‌ ఎదురు బజారు, పాతూరు, పెదచెరువు, బైపాస్‌ రోడ్డులో పర్యటించి  వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారని తెలిపారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రితో సహా టీడీపీ నేతలు జగన్‌మోహన్‌రెడ్డిపై విషప్రచారం ప్రారంభించారని  తెలిపారు. పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి అటువంటి ప్రచారాలను తిప్పికొట్టడంతో పాటు వైఎస్సార్‌ సీపీ అమలు చేయనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. నరసరావుపేట, సత్తెనపల్లిలో నియంతలా పాలన సాగించిన కోడెల కుటుంబం చివరికి టిక్కెట్టు కోసం చంద్రబాబు ముందు దేబిరించాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు.

ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా కోడెలకు టిక్కెట్టు ఇచ్చేందుకు కూడా చంద్రబాబు భయపడుతున్నాడని తెలిపారు. విచ్చలవిడిగా అవినీతి, అరచకాలకు పాల్పడే వారికి గుణపాఠం చెప్పే విధంగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పునివ్వాలని కోరారు. పార్టీ నాయకులు ఎస్‌ఎ హానీఫ్, ఖాజావలి మాస్టారు, కౌన్సిలర్‌ కారుమంచి మీరావలి, ఎస్‌కె కరీముల్లా, జి.సుబ్రహ్మణ్యం, జి.పాపారావు, షేక్‌ మస్తాన్‌వలి, ఆర్‌పీ మస్తాన్‌వలి, సైకం పుర్ణారెడ్డి, షేక్‌ బాదుల్లా, షేక్‌ జాని, ఎస్‌డీ హుస్సెన్, చిలకా బాబు, విజయకుమార్, డి.మీరావలి, షేక్‌ గాలిబ్, జి.చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీలో 50 కుటుంబాల చేరిక 
 పట్టణంలోని 31వ వార్డుకు చెందిన 50 కుటుంబాలు గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. వార్డు కౌన్సిలర్‌ కారుమంచి మీరావలి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్‌ సీపీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పట్ల ఆకర్షితులై టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు వారు తెలిపారు. ముస్లింలకు వైఎస్సార్‌ సీపీలో సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్‌ఎ హానీఫ్, మిట్టపల్లి రమేష్, మూరే రవీంద్రారెడ్డి, సీవీ రెడ్డి పాల్గొన్నారు.

రామిరెడ్డిపేటలో వైఎస్సార్‌ సీపీ కార్యాలయం ప్రారంభం
నరసరావుపేట రూరల్‌: రామిరెడ్డిపేటలోని పాతసమితి ఆఫీసు సెంటర్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బుధవారం రాత్రి ప్రారంభించారు. 23, 24 వార్డుల పరిధిలోని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి మాట్లాడుతూ పార్టీ బూత్‌ కన్వీనర్లు ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాను పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఎ.రామలింగారెడ్డి, పూనురు కోటిరెడ్డి, వనిపెంట చినకోటిరెడ్డి, గోపిరెడ్డి నరసింహారెడ్డి, ఎస్‌.సుజాతపాల్, సుబ్బారెడ్డి, పీడీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement