పెరిగిన పరీక్షలు | Capacity of Covid-19 testing in AP is currently increasing significantly | Sakshi
Sakshi News home page

పెరిగిన పరీక్షలు

Published Wed, Apr 8 2020 3:19 AM | Last Updated on Wed, Apr 8 2020 5:02 AM

Capacity of Covid-19 testing in AP is currently increasing significantly - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల సామర్థ్యం ప్రస్తుతం గణనీయంగా పెరిగింది. దేశంలో 10 లక్షల జనాభాకు గాను సగటున 47 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో 78.6 మందికి టెస్టులు జరుగుతున్నాయి. తాజాగా రోజుకు 1,170 మందికి వైద్య పరీక్షలు చేస్తున్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలోని 7 వైరాలజీ ల్యాబొరేటరీలలో ప్రతి పది లక్షల జనాభాకు 78.6 మందికి పరీక్షలు నిర్వహించేలా సామర్థ్యం పెరిగింది. రానున్న పది రోజుల్లో ప్రతి పది లక్షల జనాభాకు 300 టెస్టులు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో ఎక్కువ పరీక్షలు చేస్తున్నామని,  కడప, విశాఖపట్నం, గుంటూరులో ల్యాబొరేటరీలు అందుబాటులోకి వచ్చాక నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 6వ తేదీ నాటికి 3,930 మందికి నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది. ప్రైవేటు ల్యాబొరేటరీలు కూడా అందుబాటులోకి వస్తే టెస్టుల సంఖ్య మరింతగా పెరుగుతుందని తెలిపింది. 
  
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువే 

– ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగానే జరుగుతున్నాయని  బీఎంజే గ్లోబల్‌ హెల్త్‌ సంస్థ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఈ నెల 4వ తేదీ నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సంస్థ కరోనా పరీక్షలు, మృతుల శాతంపై అధ్యయనం చేసింది.  
– భారతదేశంలో సగటున 10 లక్షల జనాభాకు గాను సగటున 47 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో 52.74 మందికి టెస్టులు జరుగుతున్నాయి. భారతదేశంలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆ సంస్థ వెల్లడించింది.  
– కేంద్ర వైద్య ఆరోగ్య శాఖతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రకటించిన గణాంకాలు, కేసుల వివరాల ఆధారంగా ఈ వివరాలను ఇస్తున్నట్టు స్పష్టం చేసింది.   
 
ఏపీలో మెరుగ్గా కరోనా నియంత్రణ 
– చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు మెరుగ్గా జరుగుతున్నాయి. తెలంగాణ, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌ వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చాలా పైస్థాయిలో ఉంది.  
– కరోనా వైరస్‌ మృతుల నియంత్రణలో కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ మొదటి వరుసలో ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల శాతం 0.53 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. హిమాచల్‌ప్రదేశ్‌లో 16.67 శాతం, పంజాబ్‌లో 8.77 శాతం ఉంది. 
– క్వారంటైన్, ఐసొలేషన్‌ వ్యవస్థ కట్టుదిట్టంగా అమలవుతోంది. రాష్ట్రంలో 2020 ఏప్రిల్‌ 7 నాటికి 3930 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో మిలియన్‌ జనాభాకు 3.62 శాతం పాజిటివ్‌ కేసులుండగా, తెలంగాణలో అది 7.18 శాతంగా ఉంది. 
 
బీఎంజే వెల్లడించిన ముఖ్యాంశాలు..   
– దేశంలోని కేరళలో 2020 జనవరి 30న తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత కేసుల సంఖ్యా పెరిగింది. అందువల్ల కేరళలో ఎక్కువ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారు. మృతుల శాతాన్ని 0.65 శాతానికి కట్టడి చేయగలిగారు. తమిళనాడులోనూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో టెస్టుల సంఖ్యనూ పెంచారు. 
– కర్ణాటక, మహరాష్ట్రల్లో ఎక్కువ టెస్టులు చేస్తున్నా మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 
– అరుణాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లో మిలియన్‌ జనాభాకు 13 టెస్టుల కంటే తక్కువగా జరుగుతున్నాయి. 
– బిహార్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో మిలియన్‌ జనాభాకు 20 కంటే తక్కువగా టెస్టులు చేస్తుండగా, మృతుల రేషియో 3.5 శాతంగా ఉంది. 
– రాబోయే రెండు మాసాల్లో ఆయా రాష్ట్రాల్లో చేపట్టే కరోనా నియంత్రణా చర్యలను బట్టి కేసుల వ్యాప్తి ఉంటుంది. 

సైన్స్‌ జర్నల్స్‌లో బీఎంజే దిట్ట 
బీఎంజే గ్లోబల్‌ హెల్త్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా పేరున్న సంస్థ. రీసెర్చ్‌ పబ్లికేషన్స్‌కు పెట్టింది పేరు. ప్రస్తుతం ఈ సంస్థ పబ్లికేషన్స్‌కు ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన డా.సెయెఅబంబోలా సంపాదకులుగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య స్థితిగతులు, పరిణామాలను అంచనా వేయడంలో ఈ సంస్థకు మంచి పేరుంది. వైద్యులు ఈ సంస్థ పబ్లిష్‌ చేసే జర్నల్స్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement