అమరావతి అక్రమాలపై సీబీ'ఐ' | CBI Investigation On Amaravati Irregularities | Sakshi
Sakshi News home page

అమరావతి అక్రమాలపై సీబీ'ఐ'

Published Tue, Mar 24 2020 4:06 AM | Last Updated on Tue, Mar 24 2020 1:27 PM

CBI Investigation On Amaravati Irregularities - Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో టీడీపీ హయాంలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, ఇతర అక్రమాలపై దర్యాప్తును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ సోమవారం ఉత్తర్వులిచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి పేరుతో అక్రమాలకు పాల్పడినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. దీనిపై మంత్రివర్గ ఉప సంఘం అన్ని రికార్డులను పరిశీలించి వివరాలు సేకరించి గతేడాది డిసెంబర్‌ 27న నివేదిక ఇచ్చింది. ఓత్‌ ఆఫ్‌ సీక్రెసీ (అధికారిక రహస్యాలు వెల్లడించననే ప్రమాణాన్ని)ని ఉల్లంఘించినట్టు మంత్రివర్గ ఉప సంఘం నిర్ధారించింది. రాజధానిపై తమ వాళ్లకు ముందస్తు లీకులు ఇవ్వడంతో 2014 జూన్‌ నుంచి డిసెంబర్‌లోపు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా సీఆర్‌డీఏ పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,069.94 ఎకరాల భూ కుంభకోణం జరిగినట్టు నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే.

సీఐడీ, సిట్, ఈడీ దర్యాప్తు ఇలా..
- రాజధాని అక్రమాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సీఐడీ, ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) తమ పరిధిలో లోతైన దర్యాప్తు చేపట్టాయి. 
- మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. రాజధాని కోర్‌ ఏరియాలో 797 మంది తెల్లరేషన్‌ కార్డుదారులు 761.34 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు ఆధారాలు సేకరించింది.
- అమరావతి, పెదకాకాని, తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి గ్రామాల్లో తెల్లకార్డు దారులను బినామీలుగా అడ్డుపెట్టుకుని భూములు కొనుగోలు చేసినట్టు నిర్ధారించింది.
- మభ్యపెట్టి తన భూమి కొనుగోలు చేశారని వెంకటాయపాలెంకు చెందిన దళిత మహిళ పోతురాజు బుజ్జి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది. 
- టీడీపీ మాజీ మంత్రులు పి.నారాయణ, పత్తిపాటి పుల్లారావులతోపాటు టీడీపీ నాయకుడు బెల్లంకొండ నరసింహారావుపై సెక్షన్‌ 420, 506 రెడ్‌విత్‌ 120(బి)తోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం సెక్షన్‌ 3(1)(జి)(పి) కింద కేసు నమోదు చేసి.. ఆధారాలు సేకరించింది. 
- ఇప్పటి వరకు సీఐడీ ఏడు కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో మనీ ల్యాండరింగ్, అక్రమ ఆదాయం వంటి అంశాలు ముడిపడ్డాయి. 
- ఇదే వ్యవహారంపై సీఐడీ ఇచ్చిన రిపోర్టుతో రాజధానిలో అక్రమ లావాదేవీలపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌–హైదరాబాద్‌) ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌ (పీఎంఎల్‌ఏ) – 2002, ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (ఎఫ్‌ఇఎంఎ –ఫెమ)–1999 కేసులు నమోదు చేసింది. కీలక ఆధారాలు సేకరించడంలో నిమగ్నమైంది. 

డీఓపీటీకి నివేదిక
రాజధాని ప్రాంతంలో భూములను స్వాధీనం చేసుకోవడంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానంలో అనేక అవకతవకలు, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడిందనడంపై బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి.
- పేదల నుంచి భూముల సేకరణలోనే గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడినట్టు తేలింది.
- ఇందులో అనేక నేరాలు, పెద్ద ఎత్తున కుట్ర, ఫోర్జరీ(చీటింగ్‌), తప్పుడు పత్రాల తయారీ, రికార్డుల ట్యాంపరింగ్‌ వంటి అక్రమాలు చోటు చేసుకున్నట్టు మంత్రివర్గ ఉప సంఘం గుర్తించింది. 
- ఈ అక్రమాలపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ), అవినీతి నిరోధక చట్టం, బినామీ లావాదేవీలు (నిషేధ) చట్టం, మనీలాండరింగ్‌ నిరోధక చట్టం వంటి నేరాలపై కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. 
- రాజధాని అమరావతి పేరుతో అక్రమాలకు పాల్పడిన వారు ఆర్థిక లబ్ధి పొంది ఇతర రాష్ట్రాలు, విదేశాలకు కూడా నగదు తరలించినట్టు స్పష్టమవుతోంది. 
- ఈ నేరాలతో సంబంధం ఉన్న కొందరు రాష్ట్రంలో, పొరుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉండే అవకాశం ఉండటంతో జాతీయ సంస్థ దర్యాప్తు తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు బాధ్యతను సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం నివేదికను కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (డీఓపీటీ)కు పంపించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement