అయినా రుణ మాఫీ చేస్తున్నా
రైతు సాధికార సదస్సులో సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు రుణమాఫీ చేస్తే మిగతా రాష్ట్రాల్లో ఇబ్బందులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్‌బీఐ, ఇతర బ్యాంకులైతే అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయినా మాటకు కట్టుబడి రైతులకు రుణమాఫీ అమలు చేస్తున్నా’మని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రైతు సాధికార సదస్సులో ఆయన ప్రసంగించారు. రైతు రుణమాఫీకి కేంద్ర ప్రభుత్వం సహకరించలేదంటూనే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ సహకారం వల్లనే రాష్ర్టంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేవలం కేంద్రం వల్లే సాధ్యమవుతుందని చెప్పారు.ఈ లోగా ఎత్తిపోతల పథకం నిర్మించడం ద్వారా సముద్రంలోకి వృథాగా పోతున్న మిగులు జలాలను కృష్ణా డెల్టాకు మళ్లిస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీనిపై కొందరు ఇక్కడి రైతుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారని ఆయన నిందించారు. ‘నాకు ముందుగా గోదావరి జిల్లాల రైతులే ముఖ్యం. ఇక్కడ రెండో పంటకు నీరిచ్చిన తర్వాతే సముద్రంలోకి వృథాగా పోతున్న 3 వేల టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తాం’ అని ఉద్ఘాటించారు.
ఇంటికే పింఛన్ పంపిస్తా..
అర్హులైన వారికి ‘మీసేవా’ కేంద్రాలు, పోస్టాఫీసుల్లోనే కాదు రేషన్ షాపుల్లోనూ పింఛన్ల సొమ్ము పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. నడవలేని వృద్ధులకైతే ఉద్యోగులను వారి ఇళ్లకు పంపించి పింఛన్లు అందిస్తామని ప్రకటించారు. వరి ధాన్యాన్ని ఆరబెట్టే యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని ప్రకటించారు. రూ.4 లక్షలు రైతు పెట్టుబడి పెడితే మిగిలిన 75 శాతం అంటే 12 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సినీనటులు, వివిధ రంగాల ప్రముఖులు ఒక్కో పల్లెను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాల్సిందిగా చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రసంగానికి ముందు అధికారులు ఎంపిక చేసిన నలుగురు రైతులకు సీఎం రుణ విముక్తి పత్రాలను అందజేశారు.
మొక్కుబడిగా సాగిన సభ..
గత నెలలో జన్మభూమి కార్యక్రమం సందర్భంగా జిల్లా పర్యటనకు చంద్రబాబు విచ్చేసిన సందర్భంలో ఐకేపీ యానిమేటర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది, ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన రైతు సాధికార సదస్సుకు పోలీసులు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. సభకు తరలించిన రైతులు, టీడీపీ కార్యకర్తల కంటే పోలీసులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచే జిల్లావ్యాప్తంగా వందలాది మంది రైతు సంఘాల నేతలను, నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా సభకు ఎక్కువమంది రైతులను తేలేక పోయారు.
కేంద్రం సహకరించట్లేదు!
Published Sat, Dec 13 2014 3:40 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement
Advertisement