విజయనగరం పూల్‌బాగ్: ఉద్యమాలు చేసే నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయగలరేమో కాని ఉద్యమాన్ని అణచలేరని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం స్థానిక లోయర్ టాంక్‌బండ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భగత్‌సింగ్‌ను ఉరితీయగలిగారు గాని ఆయన ఆశయాలను కాదని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కి 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా తెస్తానని నమ్మబలికిన చంద్రబాబునాయుడు..ఓటుకు నోటు కేసులో ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ప్రధాని మోదీకి తాకట్టుపెట్టారని ఆరోపించారు. శాంతియుతంగా అసెంబ్లీకి ఊరేగింపుగా వెళ్తున్న సీపీఐ నాయకులను అడ్డుకుని అరెస్ట్‌లు చేయడం తగదని హితవు పలికారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బుగత సూరిబాబు, ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు టి. అప్పలరాజుదొర, పార్టీ నాయకులు ఎ. జగన్నాధం, ఏఐఎస్‌ఎఫ్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు యశ్వంత్, బాషా, విశాలాంధ్ర బుక్‌హౌస్‌మేనేజర్ ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు.
మౌన ప్రదర్శన
బొబ్బిలి: అన్యాయాలను ప్రశ్నిస్తున్న గొంతును రాష్ట్ర ప్రభుత్వం నొక్కేస్తోందని సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. సీపీఐ నాయకుల అరెస్ట్‌లను నిరసిస్తూ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోరుతూ శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న నాయకులను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. పోలీసుల తీరు చూస్తుంటే మనం బ్రిటీష్ పాలనలో ఉన్నామా అన్న అనుమానం రేకెత్తుతోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఒమ్మి రమణ, ఇతర సభ్యులు కోట అప్పన్న, ఆర్. శకుంతల, ఎల్‌వీఆర్ మూర్తి, పండు సుజాత, రాకోటి నాగమ్మ, పి. చిన్న తదితరులున్నారు.
కామేశ్వరరావు అరెస్ట్
విజయనగరం పూల్‌బాగ్: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధనకోసం సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన సీపీఐ జిల్లా కార్యదర్శి పి. కామేశ్వరరావును విజయవాడలో కంకిపాడు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ముందస్తు చర్యగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీపీఐ నేతలను ఆదివారం అరెస్టు చేసి సోమవారం ఉదయం విడుదల చేశారు. అరెస్టు అయిన వారిలో పార్వతీపురంలో ఆర్‌వీఎస్ కుమార్, బొబ్బిలిలో ఒమ్మి రమణ, సాలూరులో రామచంద్రరావును, రామభద్రపురం మండలం కొట్టక్కిలో ఆనందరావు, విజయనగరం లో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు టి. అప్పలరాజుదొర ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment