రండి.. భూకేటాయింపు తేలికే!
- ఏపీలో మీకోసం.. ప్రత్యేక డెస్కు ఏర్పాటు చేస్తా
- ‘అమరావతి’ నిర్మాణంలో మీరూ ఓచేయి కలపండి
- చెంగ్డు పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు రెడ్ కార్పెట్
- చైనాలో ఐదోరోజు పర్యటనలో బాబు బృందం బిజీ
- సిచువాన్ నుంచి షాంఘైకి పయనమైన సీఎం బృందం
సాక్షి, హైదరాబాద్: ఏపీలో పెట్టుబడులు పెట్టే చైనా పారిశ్రామికవేత్తల సౌలభ్యం కోసం ఒక ప్రత్యేక డెస్కును ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలంటూ పారిశ్రామిక వేత్తలకు ఎర్ర తివాచీ పరిచారు. చైనా పర్యటనలో ఉన్న సీఎం బృందం 5వ రోజు గురువారం సిచువాన్ రాజధాని చెంగ్డులో ఏర్పాటైన పారిశ్రామికవేత్తల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంది. తమ రాష్ట్రంలో భారీ ల్యాండ్ బ్యాంకు ఉందని, భూ కేటాయింపుల్లో ఎలాంటి సమస్యలూ ఉండబోవని చంద్రబాబు ఉద్ఘాటించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్, జపాన్ తరహాలో చైనా కూడా సహకరించాలని కోరారు. చెంగ్డును తమ రెండో మజిలీగా చేసుకుంటామని, కొత్త రాజధాని అమరావతిని చైనా అలాగే చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి
ఇండియానే తమ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా సిచువాన్ ప్రావిన్షియల్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ వైస్ చైర్మన్ యాంగ్ చింగ్ పింగ్ చెప్పారు. తాము ‘వన్ బెల్ట్-వన్ బ్రెడ్ పాలసీ’ని అనుసరిస్తున్నామన్నారు. తమకు నిర్మాణ రంగంలో గొప్ప నైపుణ్యం ఉందని, పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో తమకు మొదటి అవకాశం లభించిందన్నారు.
పెట్టుబడులకు 4 కారణాలు!
తమ పెట్టుబడులకు ఏపీని కేంద్రంగా చేసుకునేందుకు చైనాకి, సిచువాన్ రాష్ట్రానికి 4 కారణాలున్నాయని చైనాలో భారత రాయబారి అశోక్ కాంతా వాటిని సవివరంగా చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అనంతరం ఎంవోయులు కుదుర్చుకున్నారు. ఈ సమావేశంలో ఏపీ మంత్రు లు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఎంపీలు సీఎం రమేష్, గల్లా జయదేవ్, ఉన్నతాధికారులు సతీష్ చంద్ర, పీవీ రమేష్, రావత్, అజయ్ జైన్, కార్తికేయ మిశ్రా, వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.
మేం సహకరిస్తాం: చెంగ్డు మేయర్ లియాంగ్జీ
ఏపీ అభివృద్ధికి సహకరిస్తామని చెంగ్డు మేయర్ టాంగ్ లియాంగ్జీ అన్నారు. భారత్ వచ్చినప్పడు తప్పకుండా ఏపీని సందర్శిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు బృందంతో ఆయన భేటీ అయి మాట్లాడుతూ.. ఏపీలో ఉన్నత విద్యా సంస్థల్లో, వర్సిటీల్లో బోధనా ప్రమాణాలు పెంచేందుకు సహకరిస్తామన్నారు. అనంతరం సీఎం గౌరవార్ధం బాబు బృందానికి లియాంగ్జీ విందునిచ్చారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. ఏపీలో హార్డ్‌వేర్ అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని కోరారు. అనంతరం ఏపీ బృందం సభ్యులు చెంగ్డు నుంచి షాంఘై వెళ్లినట్టు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.