అనకాపల్లికి అవంతి?
=ముత్తం శెట్టికి చంద్రబాబు ఆఫర్
=ఇప్పుడే ఏమీ చెప్పలేనన్న శ్రీనివాస్
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : భీమిలి శాసనసభ్యుడు అవంతి శ్రీనివాసరావు రాబోయే ఎన్నికల్లో అనకాపల్లికి తరలివెళ్తారా? పనిలో పనిగా టీడీపీ తీర్థం పుచ్చుకుంటారా? ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ సందేహాలు నిజమయ్యేట్టు కనిపిస్తున్నాయి. ఆయన అనకాపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపున ఆయన అనకాపల్లి లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ సారి ఎన్నికల్లో సీమాం ధ్రలో ఆ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగితే డిపాజిట్లు దక్కడం కూడా కష్టమనే భయం అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను బెంబేలెత్తిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు వేరు దారులు వెదుక్కునే పనిలో పడ్డారు. మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన వర్గీయులుగా ముద్రపడ్డ ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాసరావు, చింతల పూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, కన్నబాబురాజు రాబోయే ఎన్నికల నాటికి కాంగ్రెస్ జెండా ఎత్తేస్తారని చాలా కాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
సమీకరణలు సరిపోతే వీరంతా ప్రస్తుత స్థానాలు కాకుండా ఇతర స్థానాల నుంచి తెలుగుదేశం అభ్యర్థులుగా బరిలోకి దూకుతారనే వాదనను టీడీపీ వర్గాలు కూడా కొట్టి పారేయలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు మూడు రోజుల కిందట హైదరాబాదులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంలో చంద్రబాబుకు ఆయనకు మధ్య జరిగిన రాజకీయ సంభాషణల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా అవంతికి చంద్రబాబు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.
అనకాపల్లి టీడీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు దాడి రత్నాకర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ నియోజకవర్గంలో పార్టీని నడిపేందుకు సరైన నాయకుడు లేకుండా పోయారు. ఈ పరిస్థితుల్లో అవంతికి ఉన్న ఆర్థిక బలాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే చంద్రబాబు ఈ ఆఫర్ ఇచ్చివుంటారని టీడీపీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.
అయితే చంద్రబాబుతో జరిగిన చర్చలో టీడీపీలో చేరే విషయం గురించి శ్రీనివాసరావు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదనీ, దీని గురించి ఇప్పుడే తానే మీ చెప్పలేనని దాట వేశారని తెలిసింది. ఈ విషయంపై అవంతి శ్రీనివాసరావు సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ డిసెంబరు 1న జరగనున్న తన కుమారై నిశ్చితార్థానికి ఆహ్వానించడానికే చంద్రబాబును కలిశానని చెప్పా రు. ఇందులో రాజకీయమేమీ లేదనీ, తమ మధ్య మామూలు అంశాలు తప్ప రాజకీయ పరమైన చర్చలేమీ జరగలేదని తెలిపారు.