చాలా చూశా.. పక్కకు నెట్టండి!
ఐకేపీ యానిమేటర్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం
‘పశ్చిమ’లో జన్మభూమి- మా ఊరు కార్యక్రమం రసాభాస
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘ఏయ్ పోలీస్.. వాళ్లను పక్కకు నెట్టండి. లేదంటే పక్కన కూర్చోబెట్టండి. ఇలాంటివి చాలా చూశా. ఖాళీ, పనికిమాలిన పార్టీలు చేసే రాజకీయాలకు నేను భయపడను’ పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం కలవపూడిలో శనివారం జన్మభూమి సభ సందర్భంగా జీతాల కోసం నినదించిన ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ) యానిమేటర్లను ఉద్దేశించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. సీఎం ఆదేశాలతో రెచ్చిపోయిన ఖాకీలు మహిళలని కూడా చూడకుండా ఐకేపీ యానిమేటర్లను ఈడ్చిపారేశారు.
కలవపూడిలో జరిగిన జన్మభూమి కార్యక్రమం లో చంద్రబాబు మైక్ తీసుకుని మాట్లాడటం మొదలు పెట్టగానే గ్యాలరీలో కూర్చున్న ఐకేపీ యానిమేటర్లు 16 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో చంద్రబాబు వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో రెచ్చిపోయిన పోలీసులను యానిమేటర్లు ప్రతిఘటించడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. కొందరు టీడీపీ కార్యకర్తలు యానిమేటర్లపై దాడికి యత్నించ డంతో యానిమేటర్ల జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామలారాణి స్పృహ కోల్పోయారు. అయినా యానిమేటర్లు వెనక్కు తగ్గలేదు.
వీరికి డ్వాక్రా మహిళలు మద్దతుగా నిలిచారు. ఎస్పీ రఘురామిరెడ్డి ఇద్దరు యానిమేటర్లను సీఎం వద్దకు పంపినా శాంతించలేదు. సభను చెడగొట్టడానికే వచ్చారంటూ సీఎం వారిపై మండిపడ్డారు. ఒకవైపు ఐకేపీ యానిమేటర్ల ఆందోళన జరుగుతున్నా సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం దొడ్డిపట్లలో జన్మభూమి సభలో పాల్గొన్నారు. సీఎం వెంట కార్యక్రమంలో మంత్రులు మాణిక్యాలరావు, సుజాత, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.