
హామీ అమలేది బాబూ!
కొత్తపేట :తమ పార్టీ అదికారంలోకి వస్తే డ్వాక్రా, రైతు రుణాలు అన్నీ మాఫీ చేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ నమ్మి ఓట్లేశాం. వందరోజుల పాలన ముగిసినప్పటికీ నేటికీ రుణమాఫీ విషయం తేల్చలేదంటూ మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. రుణమాఫీ హామీ దగాపై కొత్తపేట మండలం పలివెల గ్రామ సమాఖ్య సంఘం ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు రోడ్డెక్కారు. సాక్షి మీడియా ముందు చంద్రబాబుపై తమ ఆవేశాన్ని వెళ్ల గక్కారు. చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టి 100 రోజుల పూర్తయ్యింది. ఏ ఒక్క హామీ సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవు అంటూ మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయని రుణాలు చెల్లించ లేదని, తమకు ఏ సమాచారమూ లేకుండానే తమ పొదుపు ఖాతాలో ఉన్న సొమ్మును రుణం కింద జమ చేసేసుకుంటున్నారని పలువురు మహిళలు వాపోయారు. వ్యవసాయ రుణాలు తీర్చాలంటూబ్యాంక్ సిబ్బంది నోటీసులు మీద నోటీసులు ఇచ్చి వత్తిడి చేస్తున్నారని పలువురు రైతులు వాపోయారు. నమ్మించి మోసం చేసిన వారిని వదల కూడదని, రోడ్డుపైకి ఈడ్చి తగు గుణపాఠం చెప్పేందుకు దగా పడిన మహిళలు, రైతులు ఉద్యమించాలని పలివెల మహిళలు పిలుపునిచ్చారు.
రుణమాఫీ అమలు చేయకుంటే మహిళా ఉద్యమం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన డ్వాక్రా, రైతు రుణమాఫీ అమలు హామీ సాధ్యం కాదని ప్రతి పక్ష పార్టీలు, మేధావులు చెప్పినా అమలు చేసి తీరుతానని చంద్రబాబు నమ్మించారు. నిజమనుకుని నమ్మి ఓట్లేశాం. హామీ మేరకు రుణ మాఫీ చేసి తీరాల్సిందే. లేకుంటే రైతు, మహిళా ఉద్యమం తప్పదు.
- మార్గన సత్యవేణి గంగాధర్, ఎంపీటీసీ సభ్యురాలు, పలివెల
పొదుపు సొమ్ము జమ చేసేసుకుంటున్నారు
చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నాడని రుణాలు చెల్లించ లేదు. ఏ సమాచారమూ లేకుండానే మా పొదుపు ఖాతాలో ఉన్న రూ. 30 వేలు రుణం చెల్లింపు కింద జమ చేసేసుకున్నారు. ఇది చాలా దారుణం. హామీ ఇచ్చిన చంద్రబాబు మోసం చేస్తే, మాకు చెప్పా చెయ్యకుండా బ్యాంకర్లు మోసం చేస్తున్నారు.
- రామదాసు సత్యవతి, డ్వాక్రా మహిళ, పలివెల
ఇళ్లకు వచ్చి బెదిరిస్తున్నారు
మూడేళ్ల క్రితం బంగారం వస్తువులు కుదువపెట్టి వ్యవసాయ రుణం కింద రూ. 20 వేలు తీసుకున్నాం. మూడేళ్లుగా తుపాన్లు, భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో రుణాలు చెల్లించలేకపోయాం. రుణమాఫీ వర్తిస్తుందని ఆశిస్తుండగా బ్యాంకు వారు రెండు నోటీసులు ఇచ్చారు. బంగారం వేలం వేస్తామని ఇంటికి వచ్చి మరీ బెదిరించారు.
- నూలు నూకరత్నం, రైతు, డ్వాక్రా రుణ గ్రహీత, పలివెల