తమ్ముళ్లపై చంద్రబాబు ఫైర్
విశాఖపట్నం: మహానాడు వేదికగా టీడీపీ నాయకులకు అధినేత చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమంలో ప్రసంగాలు వినకుండా పెడచెవిన పెడుతున్నారని మండిపడ్డారు. ‘టీడీపీ సమస్య కార్యకర్తలతో కాదు, నాయకులతోనే. వేదికపైనే గ్రూప్ మీటింగులు పెడుతున్నారు. కూర్చుని ప్రసంగాలు వినడానికి ఇబ్బందేమిటి? అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాల’ని తెలుగు తమ్ముళ్లకు సూచించారు.
చాలా ప్రాంతాల్లో నాయకులు వర్గాలు ఏర్పాటు చేసుకుంటున్నారని, అలా చేసిన వారందరి జాబితా తన దగ్గర ఉందని చెప్పారు. నాయకుల మధ్య వైరం ఉంటే కార్యకర్తలు ప్రత్యమ్నాయం చూసుకుంటారని, అలాంటి పరిస్థితి తీసుకురావద్దని ఆయన హితవు పలికారు.
మహానాడు మొదటి రోజు చంద్రబాబు ప్రసంగిస్తుండగా చాలా మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు విశాఖ బీచ్‌లో షికార్లు చేయడంపై మీడియాలో వార్తలు వచ్చాయి. మూడు రోజులుగా జరుగుతున్న టీడీపీ మహానాడు నేటితో ముగియనుంది. సాయంత్రం మహానాడు రాజకీయ తీర్మానం చేయనున్నారు.