
జనం డబ్బు కార్యకర్తలకు!
* పారదర్శకతకు బాబు సర్కారు తూట్లు
* పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి శాఖల్లో రూ. లక్షకు పైబడిన పనుల్లో ఈ-ప్రొక్యూర్‌మెంట్ తాత్కాలికంగా బంద్
* ఏప్రిల్ 1న గవర్నర్ జారీ చేసిన జీవోను తాత్కాలికంగా నిలిపివేస్తూ మరో ఉత్తర్వు
* రూ.5 లక్షల లోపు పనులు నామినేషన్ పద్ధతిన అప్పగించే వెసులుబాటు
* పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుంగులకే దక్కనున్న పనులు!
సాక్షి, హైదరాబాద్: పారదర్శక, అవినీతి రహిత పాలన అంటూ పైకి చెబుతున్న చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం.. వాస్తవానికి అందుకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుంగులకు ప్రయోజనం కలిగించే చర్యలు చేపడుతోంది. తాజాగా రూ. లక్షకు పైబడిన పనులను టెండర్ల ద్వారా అప్పగించాలని రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ జారీ చేసిన జీవోను తాత్కాలికంగా నిలిపివేయడమే ఇందుకు ఉదాహరణ. పంచాయతీరాజ్, గ్రామీణ మంచి నీటి శాఖల్లో లక్ష రూపాయలకు పైబడి ఖర్చయ్యే పనులకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానంలో టెండర్లు పిలవాలని ఈ ఏడాది ఏప్రిల్ 1న గవర్నర్ జీవో నం 61ను జారీచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను తాత్కాలికంగా నిలిపివేస్తూ సోమవారం జీవో నం. 124ను విడుదలచేసింది. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి శాఖల్లో రూ.5 లక్షల వరకు పనులు ఈ-ప్రొక్యూర్‌మెంట్ పద్ధతిలో కాకుండా నామినేషన్ పద్ధతిలో ఇష్టమొచ్చిన వారికి అప్పగించవచ్చు. ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటుతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దమొత్తంలో ప్రయోజనం పొందనున్నారు.
పనులను ఈ ప్రొక్యూర్‌మెంట్ టెండర్ల ద్వారా అప్పగించడంవల్ల కాంట్రాక్టర్లలో పోటీతత్వం పెరగడంతోపాటు తక్కువ ఖర్చులో పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. నామినేషన్ విధానం ద్వారా అధికారులు తయారుచేసిన అంచనాలకే పనులు అప్పగించాల్సి ఉంటుంది. దీనికితోడు ప్రభుత్వ పనుల అంచనాలు, వాటికి కాంట్రాక్టర్ల ఎంపికలో అధికారంలో ఉన్నవారి మాటే పూర్తిగా చెల్లుబాటు అవుతుంది. అధికారపార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి పనుల అంచనా వ్యయం పెంచే అవకాశం ఉంటుంది. ఇటీవలే మండల, జెడ్పీ ఎన్నికలు ముగియడంతో, ప్రస్తుతం మండల, జిల్లా పరిషత్‌లలో కోట్లాది రూపాయల పనులు చేపట్టే అవకాశమేర్పడింది. మండల, జిల్లా పరిషత్ స్థాయిలో రూ. 5 లక్షల విలువ కలిగినవే ఎక్కువ పనులు ఉంటాయి. బాబు సర్కారు తాజాగా జారీ చేసిన జీవోతో పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల్లో పనులన్నింటినీ నామినేషన్ పద్ధతిన అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు, వారి అనుంగులే చేజిక్కించుకోవడానికి అవకాశమేర్పడిందన్న విమర్శలు వస్తున్నాయి.