నీరో కంటే దుర్మార్గుడు బాబు
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి
- ప్రజల కోసం చిత్తశుద్ధితో పోరాడుతోంది వైఎస్సార్ కాంగ్రెస్సే
- తెలంగాణ ఇవ్వాలని మేమెలాంటి లేఖ ఇవ్వలేదు
- ఒక తండ్రిలా ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని మాత్రమే చెప్పాం
- ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నందున సమైక్య శంఖారావం పూరించాం
- విభజనకు అనుకూలంగా బాబు లేఖలిచ్చారు
- ఇప్పుడు సీమాంధ్ర ఎలా తగలబడుతుందో చూడ్డానికి యాత్ర చేస్తున్నాడు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రోమ్ చక్రవర్తి కంటే దుర్మార్గుడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. నీతి, నిజాయితీలేని చంద్రబాబు ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకోవడం మేలని సూచించారు. రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడి చిత్తశుద్ధితో పోరాడుతున్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్సేనని, ప్రజలకు సమన్యాయం చేయడం కాంగ్రెస్‌కు చేతగాని తేలిపోయినందునే రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని కోరుతున్నామని తెలిపారు. అందుకోసం ప్రజల ఆకాంక్షల మేరకు చిత్తశుద్ధితో రాజీనామా చేశామని, వాటిని ఆమోదింపజేసుకునేందుకే శాసనసభ స్పీకర్‌ను కలిసేందుకు వచ్చామని చెప్పారు.
స్పీకర్‌కు ఫోన్‌చేస్తే అందుబాటులో లేనని చెప్పారని, మళ్లీ అందరం కలిసి వచ్చి రాజీనామాలను ఆమోదించుకుంటామని తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సార్‌సీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిందని కొందరు నేతలు దుష్ర్పచారం చేస్తున్నారనీ.. తమ పార్టీ అలాంటి లేఖ ఏదీ ఇవ్వలేదని వారు స్పష్టంచేశారు. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఒక తండ్రిలా ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని కోరామే తప్ప తెలంగాణ ఇచ్చేయాలని ఎప్పుడూ చెప్పలేదన్నారు. నిర్ణయాలపై యూ టర్న్ తీసుకోవడంగానీ, మాట మార్చడంగానీ వైఎస్సార్ కాంగ్రెస్ చేయలేదని చెప్పారు.
సీమాంధ్రులను మోసం చేసేందుకే బాబు యాత్ర
నీరో చక్రవర్తికంటే చంద్రబాబు పెద్ద దుర్మార్గుడని గడికోట, ఆకేపాటి మండిపడ్డారు. ‘‘ఇటలీ నగరం తగలబడుతుంటే రోమ్ చక్రవర్తి నీరో ఫిడేల్ వాయించుకుంటూ ఉన్నాడని ఇప్పటివరకు ఆయనే పెద్ద విలన్ అని అనుకున్నాం. అంతకంటే దుర్మార్గుడు చంద్రబాబు. సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్ర తగలబడుతుంటే... ఎలా కాలుతుందో చూద్దామని యాత్ర చేస్తున్నాడు’’ అని విమర్శించారు. నిన్నటివరకు రాష్ట్రాన్ని విభజించాలని లేఖలిచ్చిన చంద్రబాబు ఇప్పుడు సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు, కూలీలు, కార్మికులంతా సమైక్యరాష్ట్రం కోసం రోడ్లపైకి వస్తుంటే వారిని మోసం చేయడానికి ఆత్మగౌరవ యాత్ర పేరిట డ్రామాలాడుతున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా టీడీపీ, చంద్రబాబు ఏయే సందర్భాల్లో విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారనేవిషయాలను వివరించారు. ‘‘2012 డిసెంబర్ 26న రాష్ట్రాన్ని విభజించాలని ప్రధానమంత్రికి లేఖ ఇచ్చి తెలుగు ప్రజలను నిట్టనిలువునా ముంచలేదా? 2008లో తెలంగాణ ఇవ్వాలని ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆ తరువాత పొలిట్‌బ్యూరోలో తెలంగాణ తీర్మానం చేయలేదా? 2009 ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ అధికారంలోకొస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజకీయ, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పలేదా? ఇప్పుడేమో సీమాంధ్ర ప్రజల ఉద్యమంలో న్యాయముందని తిరుగుతున్నావ్? ఎవరిని మభ్యపెట్టడానికి బాబూ... ఈ మాటలు? సీమాంధ్రలో 35 రోజులుగా ప్రజలు పస్తులుండి ఉద్యమిస్తుంటే నువ్విచ్చే బహుమతి ఇదేనా? కుట్రలకు అల వాటుపడి రాజకీయం చేయడం నీకు అల వాటే. అధికారం కోసం మహానుభావుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఘనుడివి నీవు. మళ్లీ సరిగ్గా అదేరోజు తెలుగు ప్రజల ఆత్మగౌరవమంటూ యాత్ర చేస్తున్నావు
నీలో అసలు నిజాయితీ ఎక్కడుంది? ఏ రోజు నిజం మాట్లాడవు? ఇకనైనా నీవు చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలందరినీ క్షమాపణ కోరి రాజకీయాల నుంచి తప్పుకో’’ అని మండిపడ్డారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని బాబు చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ‘‘ఈరోజు (మంగళవారం) దిగ్విజయ్‌సింగ్ గారు... చంద్రబాబు నాకు మంచి మిత్రుడు. నన్ను ఏమైనా అనే అర్హత ఆయనకుందని అనలేదా? మీ బంధం వెనుక మతలబు ఏమిటి?’’అని వారు ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సమన్యాయం అంటే ఏమిటో కూడా తెలీకుండా మాట్లాడుతున్నారని... నీళ్లు, ఉద్యోగాలు, హైదరాబాద్ వంటి అంశాలపై ఇరు ప్రాంతాలకు తండ్రి మాదిరిగా న్యాయం చేయడమే సమన్యాయమని ఎమ్మెల్యేలు చెప్పారు.