విజయవాడ : దేశం మొత్తం ఆశ్చర్యపోయే రీతిలో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ జనవరి 18న స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. వచ్చే నెల నుంచి ఇంటి దగ్గరే పింఛన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడా వృద్ధులు ఇబ్బందులు పడకుండా చూస్తామన్ని తెలిపారు. రాజధాని ప్రాంతంలో పంటపొలాలు దగ్దమైన ఘటన రాజకీయ లబ్ది పొందడానికి చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో కరవు నివారణ సాధ్యమన్నారు.
చంద్రబాబు తొలుత ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శన అనంతరం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు... సీఎంను ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. తర్వాత నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో బాబు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంట్‌ను బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు....ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్మార్ట్ ఏపీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.