పర్యాటకంగానూ తిరుపతి అభివృద్ధి
సాక్షి, తిరుమల: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మికతతోపాటు పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన గురువారం తిరుపతిలో సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుమలకు వచ్చే భక్తులు స్వామిదర్శనం తర్వాత తిరుపతిలోనే రెండు రోజులు గడిపేలా పర్యాటక రంగాన్ని ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే తిరుపతి చుట్టూ వంద చెరువులను టీటీడీ ద్వారా అభివృద్ధి చేయిస్తున్నామన్నారు.
తిరుపతి చుట్టూ ఉన్న కొండలు, రిజర్వాయర్లు, ఇతర ప్రాంతాలను అనుసంధానం చేస్తూ పర్యాటక రంగాన్ని విస్తరించే చర్యలు చేపడతామని పేర్కొన్నారు. తిరుపతితోపాటు శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ఆలయాలను సందర్శించేలా ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు.
సంక్రాంతి వారసత్వాన్ని కాపాడుకోవాలి
సంక్రాంతి పండుగ వారసత్వ సంపద అని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ సంక్రాంతి నిర్వహించేందుకు గ్రామాలకు వెళ్లాలని సూచించారు. తన కుటుంబమంతా ఇంటిల్లిపాదిగా తమ స్వగ్రామమైన నారావారిపల్లెకు వెళ్లి పండుగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వచ్చే సంక్రాంతికి అన్ని గ్రామాలను ఆకర్షణీయంగా తయారుచేసి, అభివృద్ధి పథంలో నడిపిస్తావన్నారు. కూచి పూడి నృత్యాన్ని రక్షించేందుకు ఇంటికొక కూచిపూడి కళాకారుడు రావాలని ఆకాం క్షించారు. తిరుపతిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న అనంతరం చంద్రబాబు తన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు.