
సాక్షి, విజయవాడ: ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన చంద్రన్న బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ప్రవేశపెట్టగా, రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ‘చంద్రన్న’ పేరు జోడించి, పథకాన్ని తామే ప్రవేశపెట్టినట్టు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరూ గొప్పలు చెప్పుకున్నారు. తీరా పథకం అమలులో మాత్రం అంతా చతికిలపడ్డారు. ప్రభుత్వం పథకాన్ని సమర్థంగా అమలు చేయకుండా నిర్వీర్యం చేసి లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం చేస్తోంది. చంద్రన్న బీమా అమలులోకి రావడంతో గతంలో ఉన్న జనశ్రీ బీమా యోజనా కూడా వినియోగించుకోలేకపోతున్నామని కార్మిక సంఘాల నేతలు వాపోతున్నారు.
టీడీపీ సభ్యత్వ నమోదుతో కలిపి..
2016లో చంద్రన్న బీమాను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. టీడీపీ సభ్యత్వంతో కలిపి చంద్రన్న బీమాను టీడీపీ నేతలు చేయించారు. వాస్తవంగా చంద్రన్న బీమా పథకానికి ఏడాదికి రూ.15 చెల్లిస్తే అసంఘటిత రంగంలో పని చేసే కార్మికులకు, చిరు వ్యాపారస్తులకు, దుకాణాల్లో పనిచేసే సిబ్బందికి బీమా సౌకర్యం ఉంటుంది. అయితే టీడీపీ నాయకులు అతి తెలివి ఉపయోగించి టీడీపీ సభ్యత్వం తీసుకుంటే బీమా అని ప్రచారం చేశారు. అనేక మంది టీడీపీ సభ్యత్వం తీసుకుని బీమా వచ్చిందని మురిసిపోయారు. అయితే పార్టీ సభ్యత్వం పూర్తి చేసిన అధికార పార్టీ నాయకులు.. ఆ తర్వాత బీమా సంబంధించి పేర్లు నమోదుపై శ్రద్ధ తీసుకోలేదు. దీనికి తోడు చంద్రన్న బీమా నమోదు సాఫ్ట్‌వేర్ సరిగా పనిచేయకపోవడంతో అనేక మంది పేర్లు నమోదు కాలేదు.
ఇదీ పథకం..
చంద్రన్న బీమాలో పేరు నమోదు చేయించుకుంటే సహజ మరణమైతే రూ.2లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.5 లక్షలు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. బీమా సొమ్ముతోపాటు ఆయా కుటుంబాల్లో 8, 9, 10, ఇంటర్ చదివే పిల్లలకు ఏడాదికి రూ.1200 స్కాలర్‌షిప్‌లు వస్తాయి. అయితే చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉండి నష్ట పరిహారం ఎక్కువగా ఇవ్వాల్సి రావడంతో కొత్తవారిని చేరనీయకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి.
నమోదు కాని వారు 12,000 మందిపైనే..
విజయవాడలో సుమారు 40 వేల మంది షాపు ఎంప్లాయీస్, కార్మికులు, చిరు వ్యాపారస్తులు ఉంటారు. వీరి అందరికి చంద్రన్న బీమా వర్తిస్తుంది. అయితే ప్రస్తుతం నగరంలో 12వేల మంది ఈ బీమా పరిధిలోకి రాలేదని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
విజయవాడ బీసెంట్‌రోడ్డులోని ఒక షాపింగ్‌మాల్‌లో పనిచేసే ఉదయ్‌కుమార్ గత నవంబర్‌లో చనిపోయారు. ఆయన చంద్రన్న బీమాకు దరఖాస్తు చేసి.. రుసుం సైతం చెల్లించారు. బీమా మాత్రం రాలేదు. అదేమంటే ఆయన పేరునమోదు కాలేదని అధికారులు ఆయన కుంటుంబ సభ్యులకు సెలవిచ్చారు. అలాగే బందరు రోడ్డులోని ఒక వస్త్రాల దుకాణంలో బాల తిరుపతమ్మ కుంటుంబ సభ్యులదీ ఇదే పరిస్థితి. ఆమె ప్రమాదవశాత్తూ ఇటీవల చనిపోయింది. చంద్రన్న బీమా సొమ్ము రాలేదు. ఆమె పేరు కూడా నమోదు కాలేదని అధికారులు చెప్పారు.
విజయవాడలో అసంఘటిత రంగంలో పనిచేసే అనేక మంది కార్మికుల కుటుంబాలదీ ఇదే ఆవేదన. పేర్లు నమోదు చేయించినా, కనిపించవు.. ఒకవేళ పేర్లున్నా.. నగదు సకాలంలో రాదు.. కొత్తగా ఎంట్రికీ అనుమతులుండవు. ఇదీ చంద్రన బీమా కథ.
అందరికీ న్యాయం చేయాలి..
నగరంలో అనేక వేలమంది చంద్రన్న బీమా కింద నమోదు కాలేదు. సభ్యత్వ నమోదుతో కలిపి చేయడం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది. ఈ సారి బీమా అధికారులతో బీసెంట్ రోడ్డు, బందరురోడ్డు, ఏలూరు రోడ్లల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి అందరి పేర్లు నమోదు చేయించాలి. అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.– వెంకటేశ్వరరావు, షాప్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment