సరుకులిచ్చిన నెలకు..సంచులొచ్చాయ్!
పాలకొండ: సంక్రాంతి వెళ్లి నెలైంది. చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో సర్కారు ఆర్భాటంగా సరఫరా చేసిన సరుకులూ జీర్ణమైపోయాయి. కానీ ఆ సరుకుల సరఫరాకు ఉద్దేశించిన సంచులు తీరిగ్గా ఇటీవల మండలాలకు చేరాయి. వాటిని ఏం చేయాలో తెలియక అధికారులు ఆ మూటలు సైతం విప్పకుండా కార్యాలయాల్లో అలాగే ఉంచేశారు. వీటి విలువ ఎంత లేదన్నా కోటి రూపాయలకు పైనే ఉంటుంది. ఇవన్నీ వృథా అయినట్లే. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని పదే పదే చెబుతూ చెల్లింపులపై ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం ఇటువంటి అనవసర ఆర్భాటాలకు పోయి కోట్లాది రూపాయలు వృథా చేయడమెందుకున్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన నవ్యాంధ్రలో తొలి సంక్రాంతిని ప్రభుత్వపరంగా జరుపుతామంటూ సంబరాల పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది.
అందులో భాగంగా చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో రేషన్‌కార్డుదారులకు ఆరు రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. వాటిని గిఫ్ట్ ప్యాక్‌గా అందించేందుకు చంద్రబాబు ఫొటోతో సంచుల తయారీకి కూడా పురమాయించింది. జనవరి 10-14 తేదీల మధ్య లబ్ధిదారులకు ఉచిత సరుకులు పంపిణీ చేశారు. అయితే నిర్దేశించిన అన్ని రకాల సరుకులు పూర్తిస్థాయిలో అందకపోవడం, అందినవి నాసిరకంగా ఉండటం విమర్శలపాలైన విషయం తెలిసింది. దాన్ని పక్కన పెడితే సరుకుల ప్యాకింగ్‌కు నిర్దేశించిన సంచులు సకాలంలో అందకపోవడంతో చాలా చోట్ల రేషన్ డీలర్లు సొంత డబ్బులతో పాలిథిన్ కవర్లు కొనుగోలు చేసి సరుకులను ప్యాక్ చేసి లబ్ధిదారులకు అందించారు. సంక్రాంతి సంబరాలు ముగిసి సంచుల విషయం అందరూ మరచిపోయిన తరుణంలో ఇటీవల సంచులు జిల్లా కేంద్రానికి చేరాయి. వాటిని మూడు నాలుగురోజుల క్రితం మండల కేంద్రాలకు పంపించారు. ఇప్పుడు వాటిని ఏం చేయాలో తెలియక స్థానిక అధికారులు మూలన పడేశారు.
జిల్లాలో తెల్ల రంగు, అంత్యోదయ, అన్నపూర్ణ, చేనేత కేటగిరీలకు చెందిన 785056 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటితోపాటు 52వేల గులాబీ కార్డులు ఉన్నాయి. గులాబీ కార్డులు మినహాయించి మిగిలిన వాటికి ఉచిత సరుకులు అందించారు. ఈ లెక్కన కార్డుకు ఒకటి చొప్పున 785056 సంచులు అందాయి. వీటి తయారీ బాధ్యతను ఒక్కో సంచికి రూ.14 రేటుకు కాంట్రాక్టర్లకు అప్పగించారు. సరుకుల సరఫరా సమయంలో ఇది అందకపోవడం, ఇప్పుడు వచ్చినా ఉపయోగం లేకపోవడంతో వీటి కోసం చేసిన ఖర్చు వృథా అయినట్లే. జిల్లాకు అవసరమైన సంచుల తయారీకి రూ. 1.99 కోట్లు ఖర్చయినట్లు అంచనా. అయితే కొన్ని ప్రాంతాలకు సంచులు సకాలంలో అందినట్లు చెబుతుండగా.. ఎలా చూసుకున్నా రూ.కోటికి పైగా వృథా అయ్యిందని అంటున్నారు. సకాలంలో అందని సంచుల తయారీ ఆర్డర్‌ను అప్పుడే రద్దు చేసి ఉంటే ఈ ఖర్చు మిగిలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.