నేనున్నానంటూ...
సాక్షి ప్రతినిధి, విజయనగరం : చెన్నైలో బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు శాసనసభలో ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం జిల్లాకు రానున్నారు. జిల్లాలో మంగళ, బుధవారాలలో పర్యటించనున్నారు. బాధితుల ఇళ్లకు వెళ్లి నేనున్నాని భరోసా కల్పించనున్నారు. వారి కన్నీరు తుడిచి ఓదార్చనున్నారు. చెన్నై ఘటనలో జిల్లాకు చెందిన 24 మంది మృతి చెందారు. వారందరి ఇళ్లకు వెళ్లి, శోకసంద్రంలో ఉన్న ఆ కుటుంబాలను పరామర్శించనున్నారు.
పర్యటనకు ఏర్పాట్లు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు వైఎస్‌ఆర్ సీపీ విజయనగ రం నియోజకవర్గ ఇన్‌చార్జ్ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అలాగే గజపతినగరంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ కడుబండి శ్రీనివాసరావు నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు.
తొలి రోజు షెడ్యూల్....
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి విమానంలో చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంగుండా విజయనగరం మీదుగా గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరుమండలం కె.కృష్ణాపురం చేరుకుంటారు. చెన్నైలో భవనం కూలిన ఘటనలో మృతి చెందిన ఏడుగురి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి బాడంగి వెళ్లి, ఇద్దరు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం బొబ్బిలి చేరుకుని రాత్రి బస చేస్తారు.
రెండో రోజు షెడ్యూల్
రెండో రోజు సాలూరు నియోజకవర్గంలోని మక్కువ, కురుపాం నియోజకవర్గంలోని కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో పర్యటించనున్నారు. మక్కువ మండలంలోని తూరుమామిడిలో మూడు కుటుంబాలను, పెద గైశీలలో మూడు కుటుంబాలను, కొమరాడ మండలంలోని దళాయిపేటలో గల మూడు కుటుంబాలను, మాదలంగిలో ఉన్న ఒక కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం జియ్యమ్మవలస మండలం నీలమాంబపురంలో ఐదు కుటుంబాలను పరామర్శించి శ్రీకాకుళం జిల్లాకు వెళ్తారు.