హస్తం వీడి కమలం చేతబట్టిన కాంగ్రెస్ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బాటలో మరో మాజీ ఎమ్మెల్యే పయనిస్తున్నట్లు తెలుస్తోంది.
చీరాల : హస్తం వీడి కమలం చేతబట్టిన కాంగ్రెస్ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బాటలో మరో మాజీ ఎమ్మెల్యే పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన ఆమంచి కృష్ణమోహన్ కాషాయ కండువ కప్పుకునేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. గతంలో ఆయన టీడీపీలో చేరుకుందు ప్రయత్నించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి టీడీపీకి మద్దతు కూడా ప్రకటించారు.
అయితే ఆమంచి టీడీపీలోకి వచ్చే విషయంలో స్థానిక టీడీపీ నేతల నుంచి వ్యతిరేకత రావటంతో సైకిల్ ఎక్కేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఈనేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అదే సామాజిక వర్గానికి చెందిన ఆమంచితో బీజేపీ రాష్ట్ర నాయకులు చర్చలు జరపటంతో ఆయన కమలం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రోశయ్య ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆమంచి ఆయనకు కుడిభుజంగా ఉండేవారు.