
'సమన్యాయమంటే చిరంజీవికి అర్థం కాలేదు'
హైదరాబాద్: రాష్ట్ర విభజన రెండు ప్రాంతాలకు ఆమోదయోగ్యం ఉండాలని ఏనాడో చెప్పానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. రెండు ప్రాంతాల మధ్య విస్తృత చర్చలు జరపాలని సూచించినట్టు చెప్పారు. రెండు ప్రాంతాల్లో లబ్దికి కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. తాను సమన్యాయం అంటే కొందరు పెద్దలు మానవత్వం లేకుండా మాట్లాడారని వాపోయారు. సమన్యాయం ఏంటో చిరంజీవికి అర్థం కాలేదని ఎద్దేవా చేశారు.
విభజన ప్రక్రియ ప్రజాస్వామ్య పరిధిలో జరగలేదని విమర్శించారు. విభజనకు తాము వ్యతిరేకంగా కాదని, విభజన జరిగిన తీరును తాము ప్రశ్నిస్తున్నామని చెప్పారు. రూ. 17 వేల కోట్ల రెవెన్యు లోటున్న ప్రాంతాన్ని ఏవిధంగా ఆదుకుంటారనే దానిపై స్పష్టత లోపించిందన్నారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి కంటి తుడుపు చర్య అని పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మించడం అంటే భవనం నిర్మించడం కాదని, దానికి రూ.4లక్షల కోట్లు కావాలన్నారు. విద్య, వైద్య, ఆర్థిక వనరుల కల్పన సంస్థల నిర్మాణం జరగాలన్నారు. కాంగ్రెస్లో టీఆర్ఎస్ నేడో, రేపో విలీనమవుతుందని చంద్రబాబు జోస్యం చెప్పారు.