
సమస్యల వలయం
- ట్రిపుల్ ఐటీలో అధికారుల మధ్య విభేదాలు
- కొరవడిన ప్రశాంతత
- నష్టపోతున్న విద్యార్థులు
వేంపల్లె(ఇడుపులపాయ): ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ప్రస్తుతం ప్రశాంతత కొరవడింది. రోజుకో సమస్యతో సిబ్బంది, విద్యార్థులు నిరసనలు, ధర్నాలతో రోడ్డెక్కుతున్నారు. ఆర్‌జీయూకేటీ ఉన్నతాధికారులలో కూడా విభేదాలు పొడసూపడంతో ఇక్కడ కూడా అధికారులు వర్గాలుగా విడిపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తారాస్థాయికి చేరిన విభేదాలు
ట్రిపుల్ ఐటీలో ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే ఇక్కడ ఉన్న అధికారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఇక్కడ నలుగురు అధికారులు ఉండగా.. ఇద్దరు ఒక వర్గంగా.. ఇద్దరు మరో వర్గంగా విడిపోయారని తెలుస్తోంది. వీరి కింది స్థాయి సిబ్బంది కూడా చెరో వర్గానికి వత్తాసు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చినప్పుడు వీరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు బయటికి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం వారు వెళ్లగానే యధా రాజా తథా ప్రజ అన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
ఆందోళనల వెనుక ఎవరు..
ట్రిపుల్ ఐటీలో ఇటీవలి సంఘటనలు పరిశీలిస్తే వెనక నుంచి ఎవరైనా విద్యార్థులు, సిబ్బంది చేత ధర్నాలు, ఆందోళనలు చేయిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజులక్రితం భద్రతా సిబ్బంది అనవసరంగా తమను చితకబాదారని విద్యార్థులు ధర్నాకు దిగారు. దిగివచ్చిన అధికారులు ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జి క్షమాపణతోపాటు ఇద్దరు మహిళా సెక్యూరిటీ గార్డులను, ఒక హెచ్‌ఆర్‌టీని తొలగించారు. అంతటితో సమస్య సద్దుమణుగుతుందనుకున్న నేపథ్యంలో హెచ్‌ఆర్‌టీతో క్షమాపణ చెప్పించాలని మళ్లీ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో వెనకనుంచి ఎవరో కథ నడిపిస్తున్నారనే అనుమానం వ్యక్తమవుతోంది.
పోలీసుల జోక్యం తప్పనిసరి
ట్రిపుల్ ఐటీలోని సమస్యలను పరిష్కరించేందుకు పోలీసుల జోక్యం తప్పనిసరి అవుతోంది. ఇటీవల జరిగిన అన్ని ఆందోళనల సమయంలోనూ పులివెందుల డీఎస్పీ హరినాథబాబు, సీఐ మహేశ్వరరెడ్డి, వేంపల్లె, ఆర్‌కె వ్యాలీ ఎస్‌ఐలు, పోలీసులు సమస్యను పరిష్కరించే దిశగా పావులు కదిపారు. ప్రతిసారి భారీ సంఖ్యలో పోలీసులు ట్రిపుల్ ఐటీలో బందోబస్తు విధులు నిర్వర్తించాల్సి రావడం పరిస్థితి తీవ్రతను తెల్పుతోంది.