ప్రభుత్వ సక్సెస్ స్కూళ్లలో తొలగించిన కంప్యూటర్ టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వ సక్సెస్ స్కూళ్లలో తొలగించిన కంప్యూటర్ టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. సొమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కంప్యూటర్ టీచర్లు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రారంభించిన కంప్యూటర్ విద్యా పథకం గ్రామీణ పేద విద్యార్థులకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తుందన్నారు. నిరుద్యోగులకు ఉపాధిని కల్పిస్తుందని తెలిపారు.
ఐదేళ్లుగా కొనసాగుతున్న ఈ పథకాన్ని ఆర్థాంతరంగా తొలగించడం వల్ల కంప్యూటర్ టీచర్లు ఉపాధిలేక జీవనాధారాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్ యువకిరణాలు పేరుతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లక్షల ఉద్యోగాలిస్తామంటూనే కాంట్రాక్టు కార్మికులకు ఉపాధిలేకుండా చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే తొలగించిన కంప్యూటర్ ఆపరేటర్లను విధుల్లోకి తీసుకోవాలని డీఈఓ రమేశ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కంప్యూటర్ టీచర్ల సంఘం జిల్లా కార్యదర్శి ఉమారాణి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.