167వ ర్యాంకర్ శిష్యుడే గోపాలకృష్ణ
సాక్షి ప్రత్యేకం: 'రోణంకి గోపాలకృష్ణ' ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడో ప్రభజనం. తెలుగు మీడియం ద్వారా ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించిన గోపాలకృష్ణ ఎంతో మంది సివిల్స్ ఆశావాహులకు ఆదర్శంగా నిలిచారు. అయితే, సివిల్స్ కోసం పది సంవత్సరాలుపైగానే కష్టపడ్డారు గోపాలకృష్ణ. ఈ సమయంలో తాను ఎన్నో చీత్కారాలను ఎదుర్కొన్నారని ఆయన పేర్కొన్నారు. కోచింగ్ ఇవ్వడానికి సంస్ధలు ముందుకు రాలేదని కన్నీరు పెట్టుకున్నారు.
ఇన్ని కష్టాలను ఎదుర్కొన్న గోపాలకృష్ణ విజయం వెనుక ఉన్నది ఎవరో తెలుసా?. ఈ సివిల్స్ ఫలితాల్లోనే 167వ ర్యాంక్ సాధించిన బాల లత మల్లవరపు.. గోపాలకృష్ణకు శిక్షణ నిచ్చారు. బాల లత ఫేస్‌బుక్ అకౌంట్‌ను వీక్షించిన 'సాక్షి'కి ఈ విషయం తెలిసింది. గోపాలకృష్ణతో కలిసివున్న ఓ ఫోటోను తన వాల్‌లో పోస్టు చేసుకున్నారు బాల లత. 'గోపాలకృష్ణ రోణంకి.. నా విద్యార్థి- ఇన్నాళ్లకు నా కల సాకారమయ్యింది' ఇది ఆ పోస్టు సారాంశం. దానితో పాటు గోపాలకృష్ణతో కలిసి దిగిన ఓ ఫోటోను కూడా షేర్ చేశారు.
బాల లత ఏం చెప్పారంటే..
సివిల్స్‌లో 167వ ర్యాంక్‌ను సాధించిన బాల లతను సాక్షి టీవీ పలకరించింది. కింది స్ధాయి నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఐఏఎస్ కలను చేరుకోగలరని నిరూపించడానికి తాను సివిల్స్ రాసి సాధించినట్లు ఆమె పేర్కొన్నారు. తాను ఐఏఎస్ ఉద్యోగాన్ని చేపట్టనని తెలిపారు. ఐఏఎస్ కావాలని కలలుగనే వారికి శిక్షణను ఇస్తానని ఉద్వేగంగా చెప్పారు.