
భద్రాచలంలో వామపక్షాల బాహాబాహీ
తెలంగాణలోని భద్రచలం ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంలో కలపాలని కొంత మంది సీమాంధ్ర కేంద్రమంత్రులు కేంద్రాన్ని కోరడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండించింది. భద్రాచలం తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేస్తు సీపీఐ మంగళవారం భద్రచలంలో దీక్షను చేపట్టింది. అయితే ఆ పార్టీ దీక్ష చేపట్టడాన్ని సీపీఎం కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో సీపీఐ చేపట్టిన దీక్షను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు బాహబాహీకి పోటిపడ్డారు.
దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్తో పాటు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతం నాయకులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రలో పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే భద్రచలం ప్రాంతాన్ని ఆంధ్రలో విలీనం చేయాలని సీమాంధ్ర కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దాంతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భద్రచలం తమ ప్రాంతంలోనే ఉండాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందులోభాగంగా ఇప్పటికే భద్రచలంలో పలు పార్టీలు ధర్నాలు, నిరసనలు, ఆందోళన ఉధృతం చేసిన సంగతి తెలిసిందే.