హోదాపై బాబు మోసం!
ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శ
►హోదాతో మేలు లేకపోతే 15 ఏళ్లు కావాలని ఎందుకు అడిగారు?
►అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం ఎందుకు చేశారు?
►అప్పుడు హోదాతో మేలు ఏమీలేదని తెలియకుండానే చేశారా?
►14వ ఆర్థిక సంఘం హోదా రద్దు చేయలేదని దాని సభ్యులే చెప్పారు
►కేబినెట్ తీర్మానం తర్వాత 10 నెలలపాటు ఏం చేశారు?
►హోదాపై ఇప్పుడు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు
►9 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం గుర్తుకు రాలేదా?
సాక్షి, అమరావతి: పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీల అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నించక పోగా... ప్రత్యేక సాయం పేరుతో ‘హోదా’కు కేంద్రం మంగళం పాడినా ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో అభినందన తీర్మా నం ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే పార్లమెంటు చట్టంద్వారా సంక్రమిం చిన అంశాలకు మళ్లీ చట్టబద్ధత ఏమిటి అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. గురువారం శాసనసభలో అభినందన తీర్మానంపై జగన్ మాట్లాడారు. బాబు ప్రత్యేక హోదా విషయం లో రాష్ట్రాన్ని తీవ్రంగా మోసం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడంలేదంటే దానికి కారణం చంద్రబాబే అన్నారు. హోదాను 14వ ఆర్థిక సంఘం రద్దు చేసిందని సీఎం పదవిలో ఉండి అసత్యాలు చెబుతున్నారని, అలా రద్దు చేసినట్టు ఎక్కడా లేదని జగన్ మండిపడ్డారు. 14వ ఆర్థిక సంఘం సభ్యులు అభిజిత్‌సేన్.. గోవింద రావు.. ఆ సంఘం చైర్మన్ వైవీ రెడ్డి హోదా రద్దుకు సిఫార్సు చేయలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఆ విషయాలు సీఎంగా మీకు తెలియకపోవడం హాస్యాస్పదమన్నారు.
అసెంబ్లీలో తీర్మానాలు ఎందుకు చేసినట్లు?
హోదా వల్ల ఒరిగేదేమీ లేదని ఇప్పుడు చెబు తున్నారు... అలాంటప్పుడు ఆగస్టు 31, 2015లో ఒకసారి, మార్చి 16, 2016లో ఒక సారి అసెంబ్లీలో హోదామీద తీర్మానం చేసి కేంద్రానికి ఎందుకు పంపించారు అని జగన్ దుయ్యబట్టారు. మరి 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పిందో ఆరోజు బాబుకు తెలియదా? ఆర్థిక సంఘం సిఫార్సులు వచ్చిన తర్వాతనే కదా.. అవి అమలు జరుగుతున్న సమయంలోనే కదా ఈ తీర్మానాలు చేసింది? అసెంబ్లీలో తీర్మానాలు చేస్తారు, బయటికొచ్చి దానివల్ల లాభమేమీ లేదని ప్రజలను మోసం చేస్తారు ఇదేనా మీ తీరు అని నిలదీశారు. అసెంబ్లీలో తీర్మానాల కంటే ముందే తిరుపతిలో జరిగిన ఎన్నికల సభలో ఐదేళ్లు స్పెషల్ స్టేటస్ ఇస్తే కంపెనీలు రావని, అవి పెట్టేసరికే మూడేళ్లు పైన పడుతుందని, 15 ఏళ్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేయలేదా అని నిలదీశారు.
ఆ పదినెలలు ఏం చేశారు?
‘‘కేబినెట్ తీర్మానం గురించి చంద్రబాబు చెబుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాకమునుపే మార్చి 2న అప్పటి ప్రణాళికా సంఘానికి కేబినెట్ తీర్మానం చేసి పంపిం చింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల తర్వాత ప్రణాళికా సంఘం రద్దయి నీతి ఆయోగ్ ఏర్పడింది. అక్కడ కేంద్రంలో నరేంద్రమోడి ప్రభుత్వం కొనసాగుతోంది. మరి ఈ 10 నెలల కాలం చంద్రబాబు ఏం చేశారు? ప్రత్యేకహోదా గురించి వీళ్లసలు పట్టించుకున్న పాపాన పోలేదు. ’ అని జగన్ పేర్కొన్నారు. ప్రణాళికా సంఘానికి కేంద్ర కేబినెట్ ఉత్తర్వు వెళ్లినా ఎందుకు హోదా రావడం లేదని బాబు కనుక్కునే ప్రయత్నమే చేయలేదన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టేటపుడు మనకు పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్నీ ఇస్తూ ప్రత్యేకహోదా కూడా ఇస్తామని పార్ల మెంటు సాక్షిగా మాట ఇచ్చారన్నారు. ‘‘ఇవాళ వాళ్లు మిగిలిన వాటి గురించి మాత్రమే చెబు తూ హోదా ఇవ్వడం లేదని సంకేతాలిస్తున్న పుడు చంద్రబాబు ఎందుకు దానిని ప్రశ్నిం చకుండా మౌనంగా ఉన్నారు? కృతజ్ఞతలు చెప్పడానికి ఎందుకు ముందుకొస్తున్నారు?’’ అని జగన్‌ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టుపై మీకే ప్రేమ ఉందా?
‘పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు తనకే ప్రేమ ఉన్నట్టుగా చెబుతున్నారు... 2004కు ముందు ఆయన తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడెందుకు పోలవరం ప్రాజెక్టు గుర్తుకు రాలేదు’ అని జగన్ అధికారపక్షాన్ని నిలదీశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టుకు ఒక్కరూపాయి కూడా ఖర్చు చేయలేదని అన్నారు. ఇప్పటివరకూ పోలవరం ప్రాజెక్టుకు అయిన రూ.8800 కోట్ల ఖర్చులో రూ.5555 కోట్లు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఖర్చు చేసిన విషయాన్ని మీరు మర్చిపోయారా అన్నారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 172 కిలోమీటర్ల కుడికాల్వ పనుల్లో 144 కిలోమీటర్లు పూర్తి చేశారని, 182 కిలోమీటర్ల ఎడమ కాలువ పన్నుల్లో 135 కిలోమీటర్లు పూర్తిచేశారని, ఇప్పుడేమో అంతా మీరే చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. అప్పటి పోలవరం కాంట్రాక్టులో మధుకాన్ సంస్థ హెడ్‌వర్క్స్ పనుల్లో కేవలం రూ.110 కోట్ల పనులు మాత్రమే చేశారని, అందుకే ఆ సంస్థను తొలగించారన్న విషయం గుర్తుచేస్తూ ఆ కంపెనీ అధినేత నామా నాగేశ్వరరావు తెలుగుదేశం ఎంపీ అన్నది మీరు మర్చిపోయారా అని ప్రశ్నించారు. పోలవరం పనులు చేపట్టిన మరో సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీకి సంబంధించిన రూ.472 కోట్లు ఆస్తులు బ్యాంకులు వేలం వేస్తున్నా ఆ కంపెనీని తొలగించాల్సింది పోయి కొనసాగిస్తున్న విషయం మీకు ఎందుకు గుర్తుకు రాలేదో అర్థం కావడం లేదన్నారు. పనులు చేయలేని ట్రాన్స్‌ట్రాయ్‌పై వేటు వేసి.. కొత్తగా టెండర్లు పిలిచి ఉంటే.. స్టీలు, సిమెంటు, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిన నేపథ్యంలో అంచనా వ్యయం కూడా తగ్గేదని వివరించారు.
కానీ.. అడ్డగోలుగా అంచనా వ్యయం పెంచేసి.. నామినేషన్ పద్ధతిలో సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం పనులు చేస్తున్న కాంట్రాక్టర్లలో ఒకరు స్వయానా మీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడన్నది కూడా మీకు తెలియదా? అని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో పనులు మొత్తం మీకు కావాల్సిన వారికి నామినేషన్ పద్ధతిలో ఇచ్చింది వాస్తవం కాదా అన్నారు. పోలవరం ప్రాజెక్టు మీరే చెయ్యండని కేంద్రమే చెప్పిందని మీరు చంకలు గుద్దుకుంటున్నారు...కానీ ఆరోజు కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ తన ప్రెస్‌నోట్‌లో ‘రాష్ట్రమే తాము చేస్తామని విన్నవించుకుంటే పోలవరం నిర్మాణ బాధ్యతలు ఇచ్చాం’ అని చెప్పడం చూస్తే మీకంటే అబద్ధాలు ఎవరైనా చెబుతారా అని ఎద్దేవా చేశారు.
కిరణ్ సర్కారును కాపాడింది మీరు కాదా?
నాడు కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు, కిరణ్–తెలుగు సర్కారు ఉన్న సమయంలో...294 మంది ఎమ్మెల్యేలుంటే సర్కారు నెగ్గాలంటే 148 మంది బలం ఉండాలి.. కానీ ఆరోజు మీ ఎమ్మెల్యేలకు విప్ జారీచేసి సర్కారును కాపాడింది మీరు కాదా అన్నారు. మీరు కిరణ్ సర్కారుకు మద్దతునివ్వడం వల్లే ఆరోజు 146 మంది ఎమ్మెల్యేలున్నా కిరణ్ సర్కారు నెగ్గిందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ పాలకపక్షంతో కలవడం ఎక్కడైనా ఉందా? అని జగన్ ఘాటుగా విమర్శించారు.
ప్రత్యేక హోదాపై దద్దరిల్లిన సభ
అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించిన అభినందన తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల వాగ్వివాదాలతో సభ దద్ధరిల్లింది. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాను రద్దు చేసిందని, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదంటూ ధన్యవాద తీర్మానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పగానే... ఒక్కసారిగా సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు దానిపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు పూర్తిగా అసత్యాలు, అబద్ధాలు చెబుతున్నారని స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో అధికారపక్ష సభ్యులు వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దే నిలబడి ‘చంద్రబాబు అసత్యాలు ఆపాలి..అబద్ధాలు ఆపాలి’ అంటూ నినాదాలు చేసారు.
దానిపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. వీళ్లకు సభా మర్యాదలు తెలియవని, తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఎక్కువ సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేశానని అన్నారు. వీళ్లు ఏం చదువుకున్నారో తెలియదుగానీ, తానైతే ఎస్వీ యూనివర్శిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదివానని, ఎంఫిల్ కూడా చేశానని అన్నారు. వీళ్లేం చదివారో అని ప్రతిపక్ష సభ్యుల నుద్దేశించి బాబు అనగానే...తాము లోకేష్ యూనివర్శిటీలో ‘ఓటుకు కోట్లు’ చదివామని, వెన్నుపోట్లు చదివామని ప్రతిపక్ష సభ్యులు అన్నారు.
పోలవరానికి గతంలోనే చట్టబద్ధత వచ్చిందని, ఎన్నిసార్లు చట్టబద్ధత తెస్తారని ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు మండిపడ్డారు. ప్రత్యేక సాయం అంటూ ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని, నాడు తిరుపతి ఎన్నికల సభలో ఎందుకు ప్రత్యేకహోదా 15 ఏళ్ల పాటు కావాలని అడిగారని మండిపడ్డారు. అనంతరం చంద్రబాబు తాను హైదరాబాద్‌లో హైటెక్‌సిటీని కట్టానంటూ మళ్లీ మొదలెట్టారు. అబద్ధాలు అనే పదం శాసనసభలో అన్‌పార్లమెంట్ (అసభ్య పదజాలం) అని, దీన్ని ప్రతిపక్ష సభ్యులు ఎలా వాడతారని సీఎం ప్రశ్నించారు. ఈ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా స్పీకరు ఆదేశించారు.
ప్రతిపక్ష నేతకు మైక్ కట్‌చేయడంపై సభ్యుల నినాదాలు
ప్రత్యేక సాయానికి అభినందనలు తెలిపే తీర్మానంలో భాగంగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మైక్ ఇవ్వడం వెంటనే కట్‌చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు, చివరకు ఎమ్మెల్యేలకు కూడా గంటల తరబడి మైకులిస్తూ ప్రతిపక్ష నేతకు మైక్ కట్‌చేయడంపై సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వకపోతే తాము ఇక్కడ నుంచి కదిలేది లేదని నినదించారు. ఇంతలోనే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు లేచి...ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వరని, అలా ఇవ్వాలని ఏ రూలులోనూ లేదని, సభ్యులు ఇలాగే ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. అయితే ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ప్రతిపక్షనేతకు మైక్ ఇవ్వకుండానే తీర్మానాన్ని ఆమోదించేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్షనేత క్లారిఫికేషన్స్ కోసం పట్టుబట్టగా మైక్ ఇచ్చినట్లే ఇచ్చి మరలా మైక్ కట్ చేశారు. చివరగా టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర వ్యక్తిగత విమర్శలకు దిగడంతో ప్రతిపక్ష, పాలక పక్ష ఎమ్మెల్యేల మధ్య వాడి వేడి వాగ్వాదం జరిగింది.
సభ 20వ తేదీకి వాయిదా
ప్రత్యేక సాయంపై చట్టబద్ధత కల్పించినందుకు ధన్యవాద తీర్మానం ముగిసాక స్పీకర్ కోడెల శివప్రసాదరావు శాసనసభను ఈనెల 20వ తేదీకి వాయిదా వేశారు. ఈనెల 17న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటం, 18, 19వ తేదీలు శని, ఆదివారాలు కావడంతో ఈనెల 20 అంటే సోమవారానికి సభను వాయిదా వేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు శాసనసభ ప్రారంభమవుతుంది.
కౌరవ సభలా మార్చేశారు
శాసనసభ జరి గిన తీరు కౌరవసభను తలపించిం దని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం శాసనసభ వాయిదా పడిన తరువాత జగన్ బయటకు వచ్చినపుడు ఆయన ఛాంబర్ వద్ద విలేకరులతో మాట్లాడారు. సభలో పరిణా మాలపై విలేకరులడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ ‘అసెంబ్లీని కౌరవ సభగా మార్చేశారు.... ఇంకేం చెబుతాం...’ అన్నారు. తాను కడపకు వెళుతున్నానని, అక్కడ కూడా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలను కౌరవ సభ కన్నా నీచంగా మార్చేందుకు అధికారపక్షం ప్రయత్నిస్తోం దని జగన్ విమర్శించారు.