
విజయనగరం రూరల్: ఎన్నికల హామీల్లో భాగంగా అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి రూ. 2వేలు ఇస్తామంటూ మోసం చేసిన సీఎం చంద్రబాబు మరోమారు యువతను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం నాయకుడు ఈశ్వర్ కౌషిక్ అన్నారు. వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల నివాసంలో పార్టీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎస్.బంగారునాయుడు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్య, పొట్నూరు కేశవ్‌లతో కలిసి మాట్లాడారు.
గద్దెనెక్కి నాలుగేళ్ల నాటికి నిరుద్యోగ భృతి గుర్తొచ్చిందని, అదీ ఎన్నో షరతులతో రూ.1000 ఇస్తామనడం నిరుద్యోగులను, యువతను మోసగించడమేనన్నారు. నాలుగేళ్లుగా ఒక్కో నిరుద్యోగికి రూ.96వేల నిరుద్యోగి భృతి బకాయి ఉన్నారని, వాటితో కలిపి మొత్తం అందించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి జీవీ రంగారావు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎంఎల్‌ఎన్ రాజు, యువజన విభాగం నాయకులు బోడసింగి ఈశ్వరరావు, తాడి సురేష్, కారణం రమేష్, రోహిత్, అప్పలరాజు, నాగబాబు, అనీల్, రౌతు భాస్కర్ రెడ్డి, చిన్నిరవి, రజిని, గోవింద్, పవన్, కృష్ణ, గౌతం, ఎస్.ప్రసాద్, కిలారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.