
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయ పెట్టుబడి కిందఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన రైతుభరోసా పథకాన్ని ప్రారంభించేందుకు ఈ నెల 15న రాష్ట్రానికి రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు సీఎం వైఎస్ జగన్‌శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. రైతుభరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఈ నెల 15న ఒక్కో రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇవ్వాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఆయనను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలో ప్రధానిని కలిసి రైతుభరోసా పథకం ప్రారంభించేందుకు రావాల్సిందిగా సీఎం ఆహ్వానించనున్నారు. కాగా, ఇప్పటివరకు ఈ పథకం కింద 50 లక్షలకు పైగా రైతు కుటుంబాలను అధికార యంత్రాంగం గుర్తించింది. మరో రెండు లక్షల మంది కౌలు రైతులను కూడా గుర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా, ఈ నెల 15న పథకం కింద గుర్తించిన రైతుల ఖాతాలకు నిధులు జమ చేసేందుకు రూ.5,500 కోట్ల విడుదలకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.
ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అంశాలు ఇవే..
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఇదేకాక..
►పోలవరం ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండర్ ద్వారా ఎన్ని నిధులు ఆదా చేసింది కూడా వివరిస్తారు. ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయించాల్సిందిగా కోరనున్నారు.
►గోదావరి జలాలను నాగార్జున్‌సాగర్, శ్రీశైలంకు తరలించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సంయుక్తంగా చేపట్టనున్న ప్రాజెక్టుకు కేంద్రం ఆరి్థక సాయం అందించాలి..
►ప్రస్తుతం రాష్ట్రం భారీగా రెవెన్యూ లోటుతో ఉన్నందున ఆ లోటు భర్తీకి అవసరమైన నిధులు కేటాయించాలి.
►ప్రతిపాదిత విశాఖ–కాకినాడ పెట్రో అండ్ పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటునకు కేంద్రం సహకారం అందించాలి..
►విభజన చట్టంలో పేర్కొన్న మేరకు రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద నిధులను వెంటనే విడుదల చేయించాలి..
►వీటితోపాటు.. రాజధాని నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం అందించాల్సిదిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీని కోరనున్నారు.