రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్‌కుమారెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లాలో తెలంగాణవాదులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు భగ్గుమన్నారు. జిల్లావ్యాప్తంగా శుక్రవారం సీఎం దిష్టిబొమ్మల దహనాలు చేపట్టారు.
సాక్షి, నల్లగొండ : రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్‌కుమారెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లాలో తెలంగాణవాదులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు భగ్గుమన్నారు. జిల్లావ్యాప్తంగా శుక్రవారం సీఎం దిష్టిబొమ్మల దహనాలు చేపట్టారు. శవయాత్రలు నిర్వహించి వ్యతిరేకంగా నినదించారు. సీల్డ్ కవర్ సీఎం అని, తెలంగాణకు బద్ధవ్యతిరేకి అని పలువురు దుమ్మెత్తిపోశారు.
సీడబ్ల్యూసీ తీర్మానంపై ఆయన స్పందించిన తీరుతో 4.50 కోట్ల తెలంగాణ ప్రజలు మానసికంగా ఆందోళన చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా తెలంగాణ ద్రోహిగా చరిత్రకెక్కారని వ్యాఖ్యానించారు. సీఎంగా కొనసాగేందుకు ఏ ఒక్క అర్హతా లేదని, తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లాకేంద్రంలోని రామగిరిలో టీజేఎస్‌ఎఫ్, బీడీఎస్‌ఎఫ్ ఆధ్యర్యంలో సీఎం దిష్టిబొమ్మకు నిప్పుపెట్టారు. కనగల్ మండలం రేగట్టేలో జేఏసీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మకు శవయాత్ర చేపట్టి అనంతరం దహనం చేశారు. తిప్పర్తిలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆలేరు మండలం కొలనుపాక, యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి, వలిగొండ, చౌటుప్పల్, మునుగోడు, సూర్యాపేట, రామన్నపేట, నకిరేకల్ మండలాల్లో టీఆర్‌ఎస్, సంస్థాన్ నారాయణపురం, చండూరు, చివ్వెంలలో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించి దహనం చేశారు.