మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పొలిట్‌బ్యూరోకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలుసుకున్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పొలిట్‌బ్యూరోకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలుసుకున్నారు. కాంగ్రెస్‌కు తోడుగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. చంద్రశేఖర్ రాజీనామాతో జిల్లాలో గులాబీ శిబిరానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2004 ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో చిన్న నీటి పారుదలశాఖ మంత్రిగా పనిచేశారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు.
అనంతరం 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ ఓటమి చవిచూశారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో విభేదాలు పొడచూపాయి. ఆయనపై బహిరంగంగానే విమర్శనాస్త్రాలు సంధించినప్పటికీ, పార్టీని మాత్రం వీడలేదు. ఆ తర్వాత కేసీఆర్‌తో కలుపుగోలుగా వ్యవహరించినప్పటికీ, మునుపటి ప్రాధాన్యం దక్కలేదు. ఈ క్రమంలోనే పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్లు వ్యవహరించిన చంద్రశేఖర్ అదను కోసం ఎదురుచూశారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించడం ఆయనకు కలిసివచ్చింది. పార్టీని వీడేందుకు ఇదే తగిన సమయమని భావించిన చంద్రశేఖర్ వారం రోజుల క్రితం ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ కావడంతో కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై సన్నిహితులు, ముఖ్య అనుచరులతో సమాలోచనలు జరిపిన చంద్రశేఖర్ టీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్లు సంకేతాలిచ్చారు. ఈ క్రమంలోనే సోమవారం సీఎం కిరణ్‌నుకలిసి తాము కాంగ్రెస్‌లో చేరాలని అనుకుంటున్నట్లు చెప్పారు.