
తాడేపల్లిరూరల్: రాజధాని ప్రాంతంలో నిన్న మొన్నటి వరకు నివాసాలు కూల్చేందుకు యత్నించిన అధికారుల దృష్టి నేడు సీఎం ఇంటికి వెళ్లే రహదారిలో ఉన్న దేవాలయంపై పడింది. తుపానుకు రేకుల షెడ్డు నిర్మాణంలో ఉన్న దేవాలయం నేలమట్టం కావడంతో స్థానికులు చందాలు పోగు చేసి భవన నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఇరిగేషన్ అధికారులు దాన్ని కూల్చేందుకు శనివారం ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. ఆదివారం తిరిగి మరలా ఆ దేవాలయాన్ని కూల్చేందుకు ఇరిగేషన్ అధికారులు సంఘటనా స్థలం వద్దకు రాగా, స్థానికంగా ఉన్న మహిళలు, భక్తులు అడ్డుపడ్డారు. రెండు గంటల పాటు సీఎం ఇంటికి వెళ్లే రహదారిలో హైడ్రామా నడిచింది. నిర్మాణం చేసేటప్పుడు కళ్లకు కనబడలేదా? నిర్మాణం పూర్తయిన తర్వాత కూల్చడమేంటంటూ స్థానికులు ప్రశ్నించడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు సీఎం గారు తొలగించమన్నారని తెలియజేశారు. సీఎం ఉండే నివాసం కూడా అక్రమ కట్టడమే కదా, దాన్ని మీరు ఎందుకు తొలగించడం లేదు? దాన్ని తొలగించడానికి మీకు అధికారం లేదా అంటూ ఓ మహిళ ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించింది.
ఇళ్లను కూలదోసినా, ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకపోయినా ఎవరూ మాట్లాడలేదు, కనీసం దేవాలయం కూడా ఉంచరా? అని నిలదీశారు. మీరు కట్టిన ఎత్తిపోతల పథకం కనిపించడంలేదని దీన్ని కూలుస్తున్నారా? మీరు బిల్డింగ్ పడవేస్తే విగ్రహాలతో పాటు పుట్ట దెబ్బతింటుందని, దాన్ని పడేయడానికి వీల్లేదంటూ పుట్టచుట్టూ భక్తులు నిలబడ్డారు. ఇరిగేషన్ ఎస్‌ఈ చౌదరి సంఘటనా స్థలానికి వచ్చి భక్తులతో చర్చలు జరిపారు. చివరకు పుట్టకు, విగ్రహాలకు ఎటువంటి నష్టం జరగకుండా నిర్మాణాన్ని తొలగిస్తామని హామీ ఇచ్చారు. అయినాసరే వారు ఎలా తొలగిస్తారో మేము ఇక్కడే ఉండి చూస్తామని మొండికేసి బైఠాయించడంతో పుట్టచుట్టూ గడ్డర్లు ఏర్పాటు చేసి దానిపై పెద్ద పెద్ద రేకులు ఏర్పాటు చేసి, పొక్లెయిన్‌తో కూల్చేందుకు ప్రయత్నం చేశారు. అలా కూలిస్తే పుట్ట, విగ్రహాలు దెబ్బతింటాయని మరోసారి భక్తులు అటకాయించడంతో, చివరకు పొక్లెయిన్‌తో పనులు ఆపేసి, కూలీల చేత దేవాలయాన్ని కూల్చే ప్రయత్నం ప్రారంభించారు. ఏదేమైనా ఎత్తిపోతల పథకం బకింగ్ హామ్ కెనాల్ హెడ్‌స్లూయిస్ నుంచి సరిగ్గా కనిపించడంలేదని ఆ బిల్డింగ్ తొలగించాలన్న కోరిక ఇరిగేషన్ అధికారులు తీర్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment