చీర చిన్నదాయె.. బిల్లు భారమాయె
ఏలూరు (టూటౌన్) : జిల్లా మహిళా సమాఖ్య, మండల సమాఖ్యల మధ్య సీఎం సభ సందర్భంగా కొనుగోలు చేసిన చీరలు చిచ్చురగిల్చాయి. చిన్న సైజు, నాసిరకం చీరలు అంటగట్టి ఒక్కో చీరకు రూ.250 చెల్లించాలని జిల్లా సమాఖ్య ఒత్తిడి తెస్తోందని మండల,గ్రామ సంఘాల అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు గత నెల 16న జిల్లాలో పర్యటించిన సందర్భంగా మహిళా సమాఖ్యలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా మహిళా సమాఖ్య నేతృత్వంలో గ్రామ సంఘాల అధ్యక్షులు ఆకర్షణగా కనిపించేందుకు ఒకే రంగు చీరలు ధరించాలని జిల్లా సమాఖ్య భావించింది. ఈ మేరకు జూలై 14న జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు జీవమణి రూ.2.25 లక్షలు సమాఖ్య నుంచి అడ్వాన్సుగా తీసుకుని 820 చీరలు కొనుగోలు చేశారు.
15వ తేదీ రాత్రికి వాటిని మండల సమాఖ్యలకు పంపి అక్కడి నుంచి గ్రామ సంఘాలకు పంపారు. అయితే పంపిన చీరలు నాసిరకంగా ఉండడం, చిన్నసైజువి కావడంతో కొన్ని మండలాల్లోని గ్రామ సంఘాల అధ్యక్షులు వాటిని తిరస్కరించారు. మరికొన్ని మండలాల్లో గ్రామ సంఘాలకు ఆ చీరలు సకాలంలో చేరకపోవడంతో ధరించలేదు. జిల్లా సమాఖ్య నుంచి పంపిణీ చేసిన చీర ఒక్కింటికి రూ.250 చెల్లించాలని కొన్నిరోజుల కిందట గ్రామ సంఘాల అధ్యక్షులకు సమాచారం అందించారు. తాము చీరలను తిరస్కరించినా డబ్బు ఎలా అడుగుతున్నారని కొందరు, నాసిరకం, చిన్నసైజు చీరలు పంపి రూ.250 ఎలా చెల్లించమంటారని మిగిలి న వారు జిల్లా సమాఖ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతవరకు ఈ చీరల కొనుగోలు బిల్లుల లెక్కలు కార్యాలయానికి ఇవ్వకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇంత జరిగినా డీఆర్‌డీఏ అధికారులు మాత్రం తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. చీరల కొనుగోలు విషయంలో అధికారులు అనుమతిలేనట్లు తెలిసింది. అయినా రూ.2.25 లక్షలను జిల్లా సమాఖ్య నుంచి ఎలా ఖర్చు చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఈ చీరల కొనుగోలు వ్యవహారంలో గోల్‌మాల్ జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్కువ రకం చీరలను కొనుగోలు చేసి ఎక్కువ ధర వసూలు చేయాలని చూస్తున్నట్టు సభ్యులు ఆరోపిస్తున్నారు.
చీరలను తిరస్కరించాం
చీరలు నాణ్యత లోపించటంతో గ్రామ సంఘం అధ్యక్షురాళ్లు తిరస్కరించా రు. వీరవాసరం మండలానికి 10 చీరలు పంపి రూ. 2,500 వసూలు చేయమని చెప్పారు. చీరలు ఆఫీసులోనే ఉన్నాయి.
- ఎం.కృపావతి,
మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి
చీరల పొడవు తగ్గింది
చింతలపూడి మండలానికి 70 చీరలు పంపారు. అవి పొడువు తక్కువగా ఉన్నాయి. కొంతమంది కట్టుకున్నారు. మరికొందరు తిరస్కరించారు.
- కె.పార్వతి, సమాఖ్య జిల్లా కోశాధికారి
820 చీరలు కొనుగోలు చేశాం
సీఎం పర్యటన కోసం జిల్లా
సమాఖ్య నిధులతో 820 చీరలు కొని పంపిణీ చేశాం. డీఆర్‌డీ ఏ పీడీ అనుమతితోనే చీరలు కొన్నాం. నాసిరకం అని ఫిర్యాదు ఎవరూ చేయలేదు.
- ఎం.జీవమణి,
సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు
బిల్లులు ఆఫీసుకు ఇవ్వలేదు
సీఎం పర్యటన నిమిత్తం చీరలు కొనేం దుకు రూ. 2.25 లక్షలు అడ్వాన్సుగా జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలికి ఇవ్వటం జరిగింది. నేటి వరకు దానికి సంబంధించిన బిల్లులు కార్యాలయానికి అందలేదు.
- డీఆర్‌డీఏ అకౌంటెంట్ ఎన్.కల్యాణి