టిడ్కో ప్రాజెక్టులపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఏపీ టిడ్కో ప్రధాన టెండర్లు తెరిచిన మరుసటి రోజే రివర్స్ టెండర్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధాన టెండర్లకు, రివర్స్ టెండర్‌కు మధ్య ఎక్కువ సమయం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఏపీ టిడ్కో ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏపీ టిడ్కో పరిధిలోని 65,969 ఫ్లాట్ల నిర్మాణాలపై రివర్స్ టెండరింగ్ అంశాన్ని ఆయన సమీక్షించారు. మొదటిదశ కింద ఈ నెల 22న 14,368 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు తెరుస్తామని అధికారులు సీఎంకు వివరించారు.
ఆ మరుసటిరోజే రివర్స్ టెండరింగ్‌ను నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మిగిలిన ఇళ్లకూ త్వరలోనే టెండర్లు పిలుస్తామని అధికారులు చెప్పారు. గతంలో నిర్దేశించిన నిర్మాణ ప్రమాణాలను అలాగే ఉంచి రివర్స్ టెండరింగ్ పిలవాలని సీఎం స్పష్టంచేశారు. భవిష్యత్తులో పట్టణ పేదలకు ఫ్లాట్లకు బదులు ఇళ్ల స్థలాలివ్వాలని సీఎం చెప్పారు. దీనివల్ల ఫ్లాట్లలో నిర్వహణ పరంగా ప్రస్తుతం ఉన్న సమస్యలు తొలగిపోవడమే కాకుండా.. పేదలకు మరింత మేలు జరుగుతుందన్నారు. సమావేశంలో పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఏపీ టిడ్కో ఎండీ దివాన్ మైదూన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment