సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇసుక మైనింగ్ పాలసీ దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలిచిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇసుక పాలసీ అమలుపై బుధవారం ఆయన తన కార్యదర్శి ద్వారా జిల్లా కలెక్టర్ల ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు తీసుకుంటూనే అవినీతికి తావులేని, పారదర్శకమైన, అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టువేసే విధంగా ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.
ఇసుక అక్రమాలకు సంబంధించి ఒక్క కేసు నమోదైనా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందన్నారు. అవినీతి రహిత, పారదర్శకమైన ఇసుక పాలసీని అమలుచేయాలని, ఎక్కడా అక్రమాలు జరక్కుండా పటిష్టమైన వ్యవస్థ ఉండాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు. ఇందుకోసం కలెక్టర్లందరూ అన్ని వైపుల నుంచి సమగ్రమైన సమాచారం తెప్పించుకొని, అక్రమాలకు తావులేకుండా చూడాలన్నారు. రానున్న స్పందన సమావేశం నాటికి దీనిపై పక్కా సమాచారంతో సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment