రాష్ట్ర ప్రజలకు నూతన గవర్నర్ విశ్వభూషణ్ సందేశం
సాక్షి, అమరావతి: అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగే విధంగా పలు వినూత్న పథకాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక అభివృద్ధికి కృషి చేస్తున్నారని రాష్ట్ర నూతన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి బుధవారం ఆయన ఒక సందేశాన్ని విడుదల చేశారు. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేయడం, తన దృష్టికి వచ్చిన సమస్యలు, ఫిర్యాదుల ఆధారంగా నవరత్నాలు అనే మేనిఫెస్టోను రూపొందించి ప్రజల ముందుకు ప్రత్యేకంగా తీసుకువెళ్లిన విధానమే జగన్‌కు గొప్ప విజయాన్ని అందించిందన్నారు. తన తండ్రి దివంగత వైఎస్సార్ నాడు ప్రవేశపెట్టిన ప్రధాన సంక్షేమ పథకం ఆరోగ్యశ్రీని నేడు దేశం మొత్తం ఆదర్శంగా తీసుకున్న పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ఇప్పుడు మరింత మెరుగుపర్చి, కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్న జగన్ ముందుచూపును తాను అభినందిస్తున్నానని తెలిపారు.
అక్షరాస్యత రేటును పెంచేందుకు ఒక నూతన విధానాన్ని రూపొందించి, ప్రతి తల్లి తన బిడ్డను పాఠశాలకు పంపించేందుకు ప్రోత్సాహకాలను అందించడం ద్వారా ఆర్థిక, సామాజిక మార్పునకు శ్రీకారం చుట్టారని అభిప్రాయపడ్డారు. దీనివల్ల బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. వృత్తి విద్యా కోర్సులు, ఉన్నత చదువుల కోసం విద్యార్థుల అవసరాలను ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా తీర్చనున్నారని చెప్పారు. విద్య కోసం చేసే ఖర్చు మూలధనంగా పరిగణించడం ప్రశంసించాల్సిన అంశమని పేర్కొన్నారు. విద్యపై ఖర్చు చేసే సొమ్ముకు ఫలితాలు రావడానికి చాలా సుదీర్ఘమైన సమయం పడుతుందని, అయినప్పటికీ చాలా కొద్ది మంది వ్యక్తులు మాత్రమే ఈ విధమైన గొప్ప ఆలోచనలు చేస్తారని తెలిపారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు రైతులకు నగదు అందించడం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీ చేయడంతోపాటు మార్కెట్‌లో గిట్టుబాటు ధర కల్పించడం మంచి విషయమన్నారు. పింఛన్లతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ అందించేందుకు, గ్రామ వలంటీర్లను నియమించుకోవడం, వికేంద్రీకృత పాలన కోసం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడం సాహసోపేతమైన నిర్ణయమని ఆయన కొనియాడారు.
స్వామి వివేకానంద సూక్తి సదా ఆచరణీయం
‘అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకూ విశ్రమించొద్దు’ అన్న స్వామి వివేకానంద సూక్తి సదా ఆచరణీయమని గవర్నర్ పేర్కొన్నారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను వారసత్వంగా పొంది, రాజకీయ, ఆర్థిక, సామాజిక సంస్కరణలకు ఆలవాలమై పవిత్ర కృష్ణా నదీ తీరాన కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో వెలుగొందుతున్న విజయవాడ నగరంలో తాను కూడా భాగస్వామిని కావడం చాలా సంతోషకరమైన పరిణామమన్నారు. ఎందరో మేధావులు, రచయితలు, ప్రముఖులు, రాజనీతిజ్ఞులు చూపిన దూరదృష్టి, దార్శనికతతో ఆంధ్రప్రదేశ్ అనేక అంశాల్లో అగ్రభాగాన నిలిచిందని చెప్పారు. తెలుగు భాష, ఇక్కడి సంస్కృతి తనకు కొత్తేమీ కాదని, పొరుగునే తమ రాష్ట్రం ఉందని శ్రీకాకుళం పక్కనే ఉన్న గంజాం తన స్వస్థలం అని హరిచందన్ తెలిపారు. అన్ని అవరోధాలను దాటి రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించే దిశగా ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొంటూ తన సందేశం ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment