‘కోడ్‌’ దాటిన అసత్య ప్రచారం | CN Chandrababu violates the election code | Sakshi
Sakshi News home page

‘కోడ్‌’ దాటిన అసత్య ప్రచారం

Published Wed, Aug 23 2017 3:38 AM | Last Updated on Fri, Oct 19 2018 8:10 PM

‘కోడ్‌’ దాటిన అసత్య ప్రచారం - Sakshi

‘కోడ్‌’ దాటిన అసత్య ప్రచారం

నంద్యాల ఎన్నికల ప్రచారం 21వ తేదీ సాయంత్రం ముగిసిపోయింది.. 23న పోలింగ్‌ జరగనుంది.

పోలింగ్‌ ముంగిట కోడ్‌ ఉల్లంఘించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 
- నిబంధనలకు విరుద్ధంగా విలేకరుల సమావేశం
అనుకూల చానళ్లన్నిటిలో ‘లైవ్‌’ ప్రసారం..
ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం
నెల రోజుల కిందట తనే సొంత సర్వే చేయించుకొని తనే మార్కులు వేసుకున్న సీఎం
- సర్వే ఫలితాలంటూ పోలింగ్‌ ముందు రోజు ఆ వివరాలు వెల్లడి
అందులో అంతా అవాస్తవాలే..
- సీఎం తీరుతో విస్తుపోతున్న జనం
సుమోటోగా విచారణ జరపాలని ఈసీకి వైఎస్సార్‌ సీపీ డిమాండ్‌
 
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: నంద్యాల ఎన్నికల ప్రచారం 21వ తేదీ సాయంత్రం ముగిసిపోయింది.. 23న పోలింగ్‌ జరగనుంది. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ప్రచారాన్ని ఇంకా ఆపలేదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌) అమలులో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దానిని పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాల్సి ఉన్నా స్వయంగా తానే దానిని ఉల్లంఘించడం చూసి రాష్ట్రప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

సోమవారం సాయంత్రంతో ప్రచారానికి గడువు ముగిసిపోయినా మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి.. దానిని నంద్యాల ఎన్నికల ప్రచారంలా ఉపయోగించుకుని ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. ఇది కచ్చితంగా కోడ్‌ ఉల్లంఘనేనని, ఈ ఘటనను సుమోటోగా తీసుకుని ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఎప్పుడో నెల రోజుల క్రితం మొదలుపెట్టిన ఓ సర్వేలో తేలిన అంశాలంటూ కొన్ని వివరాలను ఏకరువు పెడుతూ  నంద్యాల ఓటర్లను ప్రభావితం చేసేలా ముఖ్యమంత్రి అనేక వ్యాఖ్యలు చేయడంపై విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

తీరా ఇదేదో రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన సర్వేనా అనుకుంటే అదీకాదు. ముఖ్యమంత్రి జరిపించుకుంటున్న సర్వేఅట. ఓ ప్రొఫెషనల్‌ ఏజెన్సీతో అధికారుల ప్రమేయం లేకుండా జరిపించిన సర్వే అని ఆయనే చెప్పుకున్నారు. అంటే తానే సర్వే జరిపించుకుని అందులో తేలిన అంశాలంటూ ముఖ్యమంత్రి తనకు ‘నచ్చిన సమయం’లో ‘తోచిన కథలు’ వినిపించారన్నమాట. నిబంధనలకు విరుద్ధంగా విలేకరుల సమావేశం నిర్వహించడమే కాక అందులోనూ అనేక అవాస్తవాలను గుదిగుచ్చి వివరించడం, నంద్యాల ఓటర్లను ప్రభావితం చేసేలా మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
సీఎం హైహై... చానళ్లు సైసై..
ఒకవైపు నంద్యాలలో 23వ తేదీ అంటే బుధవారం ఉదయం పోలింగ్‌ జరగనుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు 22 సాయంత్రం 6 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించడం, తగుదునమ్మా అంటూ అనుకూల చానళ్లన్నీ దానిని ఆసాంతం లైవ్‌లో ప్రసారం చేయడం చూసి ప్రజాస్వామిక వాదులంతా నిర్ఘాంతపోయారు. ఇదెక్కడి విడ్డూరమంటూ రాష్ట్రమంతా చర్చించుకుంటున్నారు. పాలన, మద్యం విధానం, ఇసుక విధానం, విశాఖ భూముల వ్యవహారం, రైతుబజార్లు, టౌన్‌ప్లానింగ్‌ తదితర అనేక అంశాలపై ఎప్పుడో నెల రోజుల క్రితం తాను జరిపించుకున్నానని చెబుతున్న ఓ సర్వేను ముఖ్యమంత్రి ఇపుడు తన ప్రచారానికి ఉపయోగించుకున్నారు.

తన ప్రభుత్వాన్ని పొగుడుకోవడానికి తన పాలనను కీర్తించుకోవడానికి ఆ సర్వేను ముఖ్యమంత్రి వాడుకున్నారు. తాము అనుసరిస్తున్న విధానాల పట్ల రాష్ట్ర ప్రజలలో సంతప్తి వ్యక్తమౌతోందని చెప్పుకునేందుకు ఈ విలేకరుల సమావేశాన్ని ఉపయోగించుకున్నారు. నెల రోజుల క్రితం ప్రారంభించిన ఈ సర్వే ముగియలేదని, ఇంకా మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని ముఖ్యమంత్రే చెప్పారు. అయినా ఇపుడు ఆ సర్వే వివరాలను ఎందుకు వెల్లడించాల్సి వచ్చింది? ఎందుకు నంద్యాల ఎన్నికల పోలింగ్‌ ముందు రోజు ఆ సర్వే వివరాలను వెల్లడించడానికి ఎంచుకున్నారు? అందులో పెద్దగా అర్ధం కాకపోవడానికి ఏమీ లేదు.

ఆ మిషతో నంద్యాల ఓటర్లను ఎంతోకొంత ప్రభావితం చేయవచ్చన్న కుట్ర ఇందులో దాగి ఉందని విమర్శకులంటున్నారు. ప్రభుత్వం బాగా పనిచేస్తోందన్న భావన ప్రజలలో కలిగించడానికే ఈ విలేకరుల సమావేశం ఉద్దేశించినట్లు స్పష్టంగా అర్ధమవుతూనే ఉందని వారు పేర్కొంటున్నారు. కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి విలేకరుల సమావేశాన్ని చానళ్లు కూడా ప్రసారం చేయకూడదన్న ఆంక్షలున్నాయి. కానీ ముఖ్యమంత్రి అనుకూల చానళ్లు ఆ సంగతిని పట్టించుకున్నట్లు లేదు. 
 
ఓటర్లను ప్రభావితం చేసే కుయుక్తులు..
తాము ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలతో చర్చించి ప్రజల ఆమోదం తీసుకున్న తర్వాతనే అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. నంద్యాలలో రోడ్ల విస్తరణ పనుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. బాధితులతో అస్సలు మాట్లాడలేదని, మాట్లాడి ఉంటే గజం రూ.1.10లక్షలున్న చోట గజం రూ.18వేల పరిహారానికి ఒప్పుకునేవారం కామని నంద్యాల ప్రజలందరికీ తెలుసు. విశాఖలో 47,315మందికి కొత్తగా ఇళ్లజాగాలిచ్చామని ముఖ్యమంత్రి చెప్పుకున్నారు. అది నిజమో కాదో.. అర్హులెందరో.. ఆ పేరుతో పచ్చచొక్కాలు కాజేసినవెన్నో తర్వాత సంగతి.. ముందు నంద్యాల ఓటర్లను ప్రభావితం చేయాలన్న దుగ్ధ ఇందులో కనిపిస్తోందని విమర్శకులంటున్నారు. 
 
అన్ని అవాస్తవాలా..?
పరిపాలన బ్రహ్మాండంగా సాగుతోందని, అధికారులలో అత్యధికులు సంతప్తిగా ఉన్నారని ముఖ్యమంత్రి చెప్పుకున్నారు. మూడున్నరేళ్లలో అవినీతి ఆకాశమెత్తుకు పెరిగిపోయిందని, 3.75 లక్షల కోట్ల రూపాయలమేర అవినీతి జరిగిందని సాక్ష్యాలతో సహా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా తన ప్రభుత్వం బాగా పనిచేస్తోందని, బాగా పాలన సాగిస్తున్నామని  ప్రచారం చేసుకునేందుకు ముఖ్యమంత్రి ఈ సొంత సర్వేను ఉపయోగించుకున్నారు. ఇసుక విధానం గురించి చెబుతూ సమస్య అంతా ప్రజల వల్లే వస్తోందని చెప్పే ప్రయత్నం చేశారు. కూలీలు రేట్లు పెంచేస్తున్నారని, రవాణాకు ఉపయోగించే లారీలు, ట్రాక్టర్ల రేట్లు పెంచేస్తున్నారని వాపోయారు. అంతేకానీ రీచ్‌లన్నీ తెలుగుదేశం నాయకులు ఆక్రమించేసుకుని దందా సాగిస్తున్నారన్న విషయాన్ని ఆయన దాచేశారు.

కూలీల రేట్లు, రవాణా చార్జీల పెంపు వల్ల రీచ్‌లలో దందాలు సాగిస్తున్న తమ్ముళ్లు బాధపడుతున్నారనేగానీ ప్రజలకు ఈ ఉచిత ఇసుక విధానం వల్ల నష్టం జరుగుతోందన్న బాధ ఆయనకు ఏ కోశానా కనిపించలేదు. బెల్టుషాపులను అరికట్టామని, పరిమితంగా వ్యాపారం చేసుకునేందుకు మాత్రమే అనుమతిస్తున్నాం తప్ప విచ్చలవిడిగా లేవని ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఎక్సైజ్‌ అధికారులకు నెలవారీ టార్గెట్లు ఇస్తున్న విషయాన్ని గానీ, తమ్ముళ్లు నడుపుతున్న మద్యం షాపుల జోలికి, బెల్టుషాపుల జోలికి వెళ్లనీయకుండా అధికారులను అడ్డుకుంటున్న విషయాన్ని గానీ ఆయన బైటపెట్టలేదు.

ఇవాళ మంచినీళ్లు దొరకని ఊళ్లు ఉన్నాయి గానీ మద్యం దొరకని, బెల్టుషాపులు లేని ఊళ్లు లేవంటే అతిశయోక్తి కాదని అందరూ అంగీకరిస్తారు. కానీ ప్రజల కళ్లకు గంతలు కట్టేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నించారు. అరకొరగా అదీ తెలుగుతమ్ముళ్లకు మాత్రమే అమలవుతున్న కొన్ని పథకాల గురించి ఘనంగా వివరించే ప్రయత్నం చేయడం చూసి జనం విస్తుపోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా కరెంటు సమస్యలేదని, తాగునీటి సమస్యలేదని, రోడ్లపై ఎక్కడా గుంతలు లేవని, వీధిలైట్లన్నీ వెలుగుతున్నాయని, ఇదంతా తాము సాధించిన ఘనత అని ముఖ్యమంత్రి చేస్తున్న ప్రచారం చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement