యలమంచిలి: పోలీసులపై కోడిపందేలరాయుళ్లు గురువారం దాడి చేశారు. విశాఖ జిల్లా యలమంచిలి పట్టణ పరిధి ఎర్రవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎర్రవరాన్ని ఆనుకుని కొండకాలువ వద్ద కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో యలమంచిలి టౌన్ ఎస్‌ఐ చంద్రమౌళి, ట్రైనీ ఎస్‌ఐలు రామకృష్ణ, రవికుమార్‌లతోపాటు మరో నలుగురు హోంగార్డులు మఫ్టీలో వెళ్లారు. పందెం రాయుళ్లు కొద్దిసేపు వారిని గుర్తించలేదు. పోలీసులు దాడులకు దిగడంతో పందెంరాయుళ్లు చెల్లాచెదురయ్యారు. పోలీసులు ఘటనాస్థలి వద్ద 7 కోళ్లు, నగదుతోపాటు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు గ్రామంలోకి వెళ్లి వీడియో క్లిప్పింగ్ ఆధారంగా నడిగట్ల చిన్నను అదుపులోకి తీసుకోవడానికి యత్నించారు. అతని భార్య అడ్డగించడంతో వివాదం చోటుచేసుకుంది.
ఆమెను పోలీసులు నెట్టేయడంతో గ్రామస్తులు మూకుమ్మడిగా దాడికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామస్తుల దాడిలో పోలీసులకు స్వల్పగాయాలయ్యాయి. తర్వాత పెద్దఎత్తున పోలీసులు గ్రామానికి చేరుకోవడంతో గ్రామస్తులు చెల్లాచెదురయ్యారు. పొన్నాడ రమణ, సోరంగి చిన్నలను యలమంచిలి టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ముత్తుగోవిందు, నడిగట్ల దుర్గతోపాటు మరో 18 మందిని వీడియో క్లిప్పింగ్‌ల ఆధారంగా గుర్తించినట్టు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.