సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ముత్యాలరాజు
నెల్లూరు(పొగతోట): ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు నిర్వహించిన సమావేశం క్షణం.. క్షణం.. భయం.. భయంగా సాగింది. కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇరిగేషన్ అధికారులు నీళ్లునమిలారు. ఇరిగేషన్ పనులకు సంబంధించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో ఇరిగేషన్ అధికారులు నివ్వెరపోయారు. ‘మీరు చెప్పే సమాధానాలకు నాకు చిరాకు వేస్తుందంటూ కలెక్టర్ ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను మాట్లాడుతున్నది తెలుగులోనే ఇంగ్లిష్ కాదని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక గోల్డెన్‌జూబ్లీహాల్లో ఇరిగేషన్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పనులు పూర్తి కాకుండా బిల్లులు ఏ విధంగా చెల్లిస్తారని ప్రశ్నించారు. వర్షాకాల సీజన్ ప్రారంభమవుతుందని తెలిసి ముందుగా ఎంబుక్స్ ఎందుకు నమోదు చేస్తారని అడిగారు. బదిలీ అయిన తరువాత పాత తేదీలు వేసి బిల్లులు ఎందుకు పెడుతున్నారని అధికారులపై మండిపడ్డారు. ఈ విధంగా అవకతవకలకు పాల్పడే వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఎంబుక్కులకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభం కాకుండా బిల్లులు పెట్టడం, వర్షాకాలం వస్తుందని తెలిసి ఎంబుక్కులు నమోదు చేసిన ఏఈలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. పనుల నాణ్యతను పరిశీలించకుండా బిల్లులు చెల్లిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు నాణ్యతలేని పనులను ఎన్ని గుర్తించారు?, ఎటువంటి చర్యలు చేపట్టారని కలెక్టర్ ప్రశ్నించారు. ప్రతి వారం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. చెక్‌డ్యామ్‌లను మార్చి 10వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు.
116 రోజులకు సంబంధించి యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేసుకోకపోతే పనులు ఏవిధంగా పూర్తి అవుతాయన్నారు. కాలువ పనులకు సంబంధించి అటవీ అధికారులతో చర్చించాలన్నారు. సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. అందరు సమన్వయంతో పనిచేసి అటవీ అనుమతులు తీసుకోవాలన్నారు. నీరు–చెట్టు పనులకు అగ్రిమెంట్ చేసుకుని ముందుకు రాని కాంట్రాక్టర్లకు నోటీసులు వ్యక్తిగతంగా అందజేయాలన్నారు. అటువంటి పనులను రద్దు చేయాలన్నారు. 12 మండలాల్లో అనుకున్న స్థాయిలో పనులు జరగడంలేదన్నారు. ఈ మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా, పంటలు ఎండకుండా నీరు సరఫరా చేయాలని సూచించారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జలవనరుల శాఖ ఎస్‌ఈ ప్రసాధ్, తెలుగుగంగ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, రెగ్యులర్ ఎస్‌ఈ నాగులమీరా, డీఈలు, ఈఈలు, ఏఈలు తదితర అధికారులు పాల్గొన్నారు.
కరువు మండలాల్లో రైతులకు రుణాలు మంజూరు చేయండి
నెల్లూరు(పొగతోట): కరువు మండలాల్లో రైతుల రుణాలు రీషెడ్యూల్ చేసి తిరిగి రుణాలు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ప్రకటించిన 15 మండలాల్లో రైతులు తీసుకున్న రుణాలను టర్మ్‌లోన్లుగా మార్పు చేయించాలని బ్యాంకర్లకు సూచించారు. టర్మ్‌లోన్లను మూడేళ్లలో తిరిగి చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎల్‌ఈసీ కార్డులు, సీఓసీలు అధికంగా మంజూరు చేయించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, క్రిస్టియన్ కార్పొరేషన్ల ద్వారా 2015–16, 2016–17, 2017–18 సంవత్సరాల్లో మంజూరు చేసిన యూనిట్లు అధికశాతం గ్రౌండింగ్ కాలేదన్నారు. లబ్ధిదారులకు పథకాలు మంజూరు చేసేందుకు మార్చి 2వ తేదీన మేగా గ్రౌండింగ్ మేళా నిర్వహించాలని సూచించారు. ఎస్టీ భూమి కొనుగోలు పథకానికి సంబంధించి ప్రతిపాదనలు జిల్లా ఎంపిక కమిటీకి పంపించాలన్నారు. మార్చి 15వ తేదీ లోపు పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. పథకాల అమలులో సమస్యలు ఉంటే, వాటిని ఈ నెల 26వ తేదీన నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో తెలియజేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎల్‌డీఎం వెంకట్రావ్, వ్యవసాయ శాఖ జేడీ చంద్రనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఇన్‌చార్జి ఈడీ రోజ్‌మండ్, ఐటీడీఏ పీఓ కమలకుమారి, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment