బిట్రగుంట, న్యూస్‌లైన్: కావలి కాలువ కింద సాగులో ఉన్న ఆయకట్టులో ఎకరం పంటను కూడా ఎండనివ్వకుండా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ తెలిపారు. సాగునీరు అం దక కావలి నియోజకవర్గం లో ఎండుతున్న పంటలపై ‘సమరసాక్షి’ కథనాలకు స్పందించిన కలెక్టర్ కొండబిట్రగుంట, పాతబిట్రగుంట గ్రామాల్లో ఎండిపోతున్న వరి పైరును గురువారం పరిశీలించారు. ఆయకట్టు పరిస్థితిపై రైతులను ఆరా తీశారు. నీరందక చివరి ఆయకట్టులో లేతపొట్టదశలో ఉన్న పంట మొత్తం ఎండిపోతోందని రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. రెండు తడులకు నీరు అందిస్తే పైరుకు ప్రాణం పోసినట్టేనని వివరించారు.
వెంటనే కలెక్టర్ తన వెంట ఉన్న సోమశిల, ఇరిగేషన్ అధికారులతో సాగునీటి సరఫరాపై చర్చించారు. కావలి కాలువకు ఎన్ని క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు? కాలువ నుంచి శ్రీవెంకటేశ్వరపాళెం నకు ఎంత నీటిని వదులుతున్నారు ? ఆయకట్టు చివరి ప్రాంతానికి ఎంత నీరు అందుతోందని ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారులు రికార్డుల ప్రకారం లెక్కలు చెబుతుండగా రైతులు అభ్యంతరం తెలిపారు. అవన్నీ అబద్ధాలేనని, శివారు ఆయకట్టు వద్ద కాలువ కూడా తడవడం లేదని కలెక్టర్‌తో చెప్పారు.
ఎగువ ప్రాంతాల్లోని అనధికారిక ఆయకట్టులో రైతులు మోటార్లతో నీటిని తోడేస్తుండటంతో చివరి ఆయకట్టుకు చుక్కనీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ కూడా పూడికతో నిండిఉండటంతో క్యూసెక్కుల లెక్కలు కచ్చితంగా లేవన్నారు. స్పందించిన కలెక్టర్ మరోమారు సోమశిల, ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. సంగం బ్యారేజీ వద్ద ఇసుక బస్తాలు వేసి కావలి కాలువకు 550 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సూచించారు. అక్రమ మోటార్లు వినియోగాన్ని తగ్గించేందుకు, వారబందీ ప్రకారం సాగునీటిని వినియోగించుకునేందుకు ప్రత్యేక బృందాలతో కాలువపై గస్తీ నిర్వహించాలన్నారు. కాలువల వద్ద నీటి మట్టాలను పరిశీలించి పంటలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అధికారులకు ముచ్చెమటలు
సాగునీటి విడుదలపై కలెక్టర్ శ్రీకాంత్ ప్రశ్నల వర్షం కురిపించడంతో అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. సోమశిల, ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో కాలువకు ఎన్ని క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు, ఆయకట్టు చివరి ప్రాంతానికి ఎంత నీరు వెళుతుందనే విషయంపై వారికి స్పష్టత కరువై సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్, సోమశిల ఎస్‌ఈలు సోమశేఖర్, కోటేశ్వరరావు, డీఈలు, తహశీల్దార్ లావణ్య, ఎంపీడీవో కనకదుర్గా భవాని, వివిధ విభాగాల అధికారులు ఉన్నారు.
ఎకరం కూడా ఎండనివ్వం
Published Fri, Dec 20 2013 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement