ఉండవల్లి నోట్లో ‘మట్టి’!
ఇసుక లారీల స్వైరవిహారంతో గ్రామంలో వాతావరణ కాలుష్యం
రోడ్లపై నుంచి వస్తున్న దుమ్ము ధూళితో పంటలకు తీవ్ర నష్టం
ఇళ్లల్లోకి వ్యాపించడంతో ప్రజలు అనారోగ్యంపాలు
దెబ్బతింటున్న రోడ్లు..ఇబ్బందులు పడుతున్న వాహన చోదకులు
ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం..స్థానిక పంచాయతీకి పంగనామం
తాడేపల్లి రూరల్ : పచ్చని పంట పొలాలు ప్రకృతి రమణీయతతో అలరారుతున్న ఉండవల్లి గ్రామం నోట పాలకులు ‘మట్టి’ కొడుతున్న వైనం నిత్యకృత్యంగా మారింది. కృష్ణానది ఇసుక రీచ్ నుంచి నిరంతరం గ్రామంలో తిరుగుతున్న లారీలే అందుకు కారణం. ప్రభుత్వం ఆదాయం కోసం ఉండవల్లిలో ఇసుక రీచ్‌కు అనుమతులు మంజూరు చేసింది తప్ప, ఇసుక లోడులతో తిరుగుతున్న లారీల వల్ల తలెత్తే పరిణామాలను మాత్రం ఆలోచించలేదు.
రీచ్ నుంచి రోజూ వందల లారీలు అటు గుంటూరు, ఇటు కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాలకు ఎడాపెడా ఇసుక పంపిణీ చేస్తున్నాయి. ఈ వందలాది లారీలు గ్రామంలోని పంట పొలాల మధ్య నుంచి, నివాస గృహాల మధ్యగా, కొండవీటి వాగు వంతెన మీదుగా ప్రయాణిస్తూ వాతావరణ కాలుష్యాన్ని కలగజేస్తున్నాయి.లారీల నుంచి వచ్చే పొగతోపాటు దుమ్ము ధూళి అటు పొలాలు, ఇటు నివాస గృహాల్లోకి వ్యాపిస్తోంది.
ఫలితంగా దిగుబడికి సిద్ధంగా ఉన్న పొలాలకు నష్టం వాటిల్లి అన్నదాతలకు కన్నీరు మిగులుతోంది. మరో పక్క చేతికి వచ్చిన పంటలు సైతం దుమ్ము ధూళి వల్ల నాణ్యత తగ్గి రైతులకు ఆశించిన ధర లేక, నష్టాన్ని అందిస్తోంది. దీంతోపాటు పొలాలకు వెళ్లే రైతులు, గ్రామస్తులు లారీల జోరుకు ప్రాణాలు అరచేత పెట్టుకుని, రోడ్లెక్కాల్సి వస్తోంది.
కొందరు లారీ డ్రైవర్లు తక్కువ సమయంలో ఎక్కువ ట్రిప్పులు వేయాలనే లక్ష్యంతో ఇరుకుగా, ట్రాఫిక్‌తో ఉన్న రోడ్లపై కూడా అతి వేగంగా వెళ్లడంతో ద్విచక్ర వాహన చోదకులు, పాదచారులు నానా యాతనలు పడుతున్నారు. ఉండవల్లి సెంటర్ నుంచి ఇసుక రీచ్ వరకు కేవలం సింగిల్ రోడ్డు నిర్మించడంతో రహదారిపై గుంటలు ఏర్పడడం, కొండవీటి వాగు, గుంటూరు చానల్‌పై నిర్మిం చిన వంతెనలు కంపించి పోవడం ఇక్కడ నిత్యకృత్యం.
ఇసుక క్వారీ నుంచి భారీ స్థాయిలో ప్రభుత్వం ఆదాయాన్ని ఆర్జిస్తూ కూడా స్థానిక పంచాయతీ కార్యాలయానికి చెందాల్సిన అధికారిక వాటాను మాత్రం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ఫలితంగా పంచాయతీకి ఆదాయం తగ్గి గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఇది పంచాయతీ నోట్లో మట్టి కొట్టడమేనని సాక్షా త్తూ గ్రామస్తులు అంటున్నారు.
అనారోగ్యంపాలు.. ఇదిలా ఉంటే నిరంతరం తిరుగుతున్న లారీల తాకిడితో కొందరు ద్విచక్ర వాహన చోదకులు, పాదచారులు విస్తారంగా ఆవహిస్తున్న దుమ్ము ధూళి వల్ల ఆరోగ్యాలు పాడై, ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అప్పుల పాలవుతున్నారు. మొత్తంగా ఉండవల్లిలో కొనసాగుతున్న ఇసుక రీచ్ అటు ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో ఆదాయం తెచ్చిపెడుతూ, ఇటు గ్రామస్తులకు, రైతులకు, రోడ్లపై సంచరించే ప్రయాణికుల నోట్లో మట్టి కొడుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వాధికారులు తక్షణమే స్పందించి లారీల స్వైర విహారం వల్ల తలెత్తుతున్న ఇబ్బందికర పరిస్థితులను నివారించాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ ప్రయాణ పద్ధతులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.