- సిమెంట్ ధరలు పైపైకి...
- అదే దారిలో ఇతర ముడి సరుకు ధరలు
- నిర్మాణాలపై అదనపు భారం
‘ఇల్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు...’ అన్నారు పెద్దలు. పెళ్లి మాటేమో గానీ ఇల్లు కట్టడం మాత్రం పేద, మధ్య తరగతి ప్రజలకు తలకు మించిన భారంగా మారింది. సిమెంట్ ధర వారం రోజుల వ్యవధిలో గతంలో ఉన్నడూ లేనంతగా పెరిగింది. ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే ముడి సరుకు ధరలూ అదే తరహాలో పెరుగుతుండడం సామాన్యులకు ఆందోళన కలిగిస్తోంది.
వారం రోజుల వ్యవధిలో సిమెంట్, ఇటుక, స్టీల్, చిప్స్(కంకర), ఇసుక ధరలు పెరగడం వల్ల నిర్మాణాలపై అదనపు భారం పడుతోంది. పిల్లర్లు, స్లాబులకు ఉపయోగించే ఇనుము(స్టీల్) కొంత ఊరట నిస్తున్నాయి. కానీ మిగిలిన ముడి సరుకుల ధరలు పెరగడంతో ఇళ్ల నిర్మాణదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మండలంలో సొంత ఇళ్లు, ఇతర వాణిజ్య సముదాయాలు, పాఠశాల భవనాలు అధిక సంఖ్యలో నిర్మాణ దశల్లో ఉన్నాయి. ధరల పెరుగుదల కారణంగా మందగించాయి. వేసవిలోనే నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశం చేయాలని భావించిన వారికి పెరిగిన ధరలు షాక్‌నిస్తున్నాయి.
రూ.300 చేరిన సిమెంట్
వారం రోజుల క్రితం సిమెంట్ ధర అరకులోయలో రూ. 245 ఉంటే అదే సిమెంట్ ధర ఇపుడు రూ. 300 చేరింది. సిమెంట్ పరిశ్రమల యజమానులు సిండికేట్‌గా ఏర్పడడంతో ఒక్కసారిగా ధరలు ఆకాశనంటుతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నారు. భవిష్యత్‌లో మరలా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బస్తాకు రూ. 60 వరకు పెరగడం గమనార్హం.
ఇటుకల ధరలు పైపైకి...
భవన నిర్మాణానికి అవసరమైన అన్ని ముడి సరుకుల మాదిరిగానే ఇటుకల ధరలు పెరిగాయి. రెండు వేల మట్టి ఇటుక గతంలో రూ. 8వేలు ఉండగా, ప్రస్తుతం రూ. 10 వేలుకు పెరిగింది. వెయ్యి ఫాల్ జి బ్రిక్స్ రూ. 13వేలు నుంచి రూ. 15వేలకు పెరిగింది.
ఇసుక బంగారమే...
భవన నిర్మాణానికి ఇసుక ప్రాణదాత. చుట్టుపక్కల గెడ్డల్లో ఇసుక లభిస్తున్నా ధర మాత్రం ఎక్కువగానే ఉంది. ఇసుక బంగారంగా మారింది. ఇదే అదనుగా ట్రాక్టర్, లారీల యజమానులు అదనపు ధరలకు విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక ధర రూ. 800 నుంచి రూ. 1000 పలుకుతోంది. వర్షాకాలం రానుండడంతో ట్రాక్టర్, లారీల యజమానులు ఇసుక నిల్వలు చేసుకుంటున్నారు. మార్కెట్‌లో గిరాకీని బట్టి ధరలు పెంచుతున్నారు.
కంకర...ధర కటకట :
నిర్మాణాలకు అవసరమైన కంకర ఎస్.కోట సమీపం నుంచి ఈ ప్రాంతానికి ఎక్కువగా దిగుమతి అవుతోంది. నాణ్యమైన కంకర కావడంతో వినియోగదారులు వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో కంకర ధర బాగా పెరిగింది. కొద్ది రోజుల క్రితం రెండు యూనిట్‌ల లారీ లోడు రూ. రూ.10వేల నుంచి రూ.13వేలకు చేరింది. 40 యం.యం. లారీ లోడు రూ. 7,500 నుండి రూ.9 వేలుకు చేరింది.
పునాది బండ...గుది బండ :
పునాదులకు ఉపయోగించే బండ రాళ్ల ధర కూడ బాగా పెరిగింది. పునాదులకు అవసరమైన ట్రాక్టర్ లోడు బండరాళ్లు రూ. 1200 నుంచి రూ. 1500 చేరింది. అయినా ఒక యూనిట్ రాయి పూర్తిగా రావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు.