పొగడ్తలకే పరిమితమైన జన్మభూమి సభలు
ఒక్క రూపాయి కూడా విదల్చని వైనం
జన్మభూమి కమిటీ సభ్యుల దౌర్జన్యం
అందిన దరఖాస్తులు 2,78,607
మచిలీపట్నం : జిల్లాలో పది రోజులపాటు నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమం మొక్కుబడిగానే సాగింది. ఎనిమిది నెలల వ్యవధిలో ప్రభుత్వపరంగా ఎలాంటి కేటాయింపులు లేకున్నా 99 శాతం అర్జీలను పరిష్కరించినట్లు చూపడం విస్మయానికి గురిచేస్తోందని ప్రజలు, విపక్ష నేతలు పేర్కొంటున్నారు. ఒక్క రూపాయి నిధులు కూడా విదల్చకుండానే పాలకు లు ప్రసంగాలతో ప్రజలను మభ్యపెట్టారు. టీడీపీ నేతలు ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తడానికి ఈ కార్యక్రమాన్ని వేదికగా చేసుకున్నారు. ప్రజలు చెప్పిన సమస్యలను పట్టించుకోకుండా సాచివేత ధోరణితో వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. జన్మభూమి గ్రామసభల్లో అన్ని శాఖల అధికారులు స్థానిక ప్రజలతో సమావేశమై అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. కానీ ఈ ప్రక్రియ ఎక్కడా కనిపించలేదు. ఆయా గ్రామాల్లో ప్రస్తుతం చేస్తున్న పనులను వివరించారే గానీ చేపట్టబోయే పనులు.. అందుకు కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించలేదు. తాగునీరు, పింఛన్ల పంపిణీపై స్థానికులు అధికారులను నిలదీయగా దాటవేత ధోరణి ప్రదర్శించారు.
జన్మభూమి గ్రాంటు సీఎం ఖర్చులో జమ
జిల్లాలో 971 పంచాయతీలు, 277 వార్డుల్లో జన్మభూమి నిర్వహించారు. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలులో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాల సమస్యను ప్రజలు సీఎం దృష్టికి తీసుకురాగా పరిష్కారం చూపకుండా జాయింట్ కలెక్టర్‌పై మండిపడ్డారు. ప్రతి జన్మభూమి సభకు రూ. 5 వేలు ప్రభుత్వం ఖర్చుగా ఇస్తుందని ప్రకటించినా.. ఇంతవరకు ఇవ్వలేదు. జిల్లా మొత్తానికి విడుదలయ్యే మొత్తంలోనే ము ఖ్యమంత్రి సభకు అయ్యే ఖర్చులు ఉంటాయని అధికారులు చెప్పడం గమనార్హం. మంత్రులు పాల్గొన్న జన్మభూమి కార్యక్రమాలకు భారీఎత్తున పోలీసులను ఏర్పా టు చేయడం విమర్శలకు దారితీసింది. మూడో విడత జన్మభూమిలో 99,900 మందికి రేషన్‌కార్డులు ఇస్తామని ప్రకటించారు. వీరిలో 60,147 మందికి పంపిణీ చేశారు. ఇందులో దాదాపు 40 శాతం తప్పులతడకలే. మచిలీపట్నం మండలం పోతేపల్లిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో భూసేకరణ అంశంపై రైతులు మంత్రి కొల్లు రవీంద్రను నిలదీయడంతో గందరగోళం నెలకొంది. జిల్లాలో 1248 జన్మభూమి - మాఊరు సభలు నిర్వహించారు. ఈ సభల్లో 2,78,607 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. పదో తేదీ నాటికే పూర్తి సమాచారం అధికారుల వద్ద ఉండగా 11వ తేదీ సమాచారం ఆన్‌లైన్‌లో లభ్యం కావడం లేదు. పింఛన్లు ప్రతినెలా ఇస్తున్నప్పటికీ జన్మభూమిలోనే ఇచ్చినట్లు ఆ మొత్తాన్ని లెక్కల్లో చూపారు.
పాత అర్జీలే పరిష్కారం కాలేదు
టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014 అక్టోబరు, 2015 జూన్ నెలల్లో మొదటి, రెండో విడత జన్మభూమి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో 5,79,561 దరఖాస్తులు రాగా వాటిలో 5,75,634 పరిష్కరించినట్లు చూపారు. 3,927 దరఖాస్తులను పెండింగ్‌లో ఉన్నట్లు చూపుతున్నారు.
ముందస్తు నిర్బంధం
సీఎం పాల్గొన్న పెనుగంచిప్రోలు సభలో సమస్యలు వివరించేందుకు వెళుతున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉదయభానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైలవరంలోనూ ఆ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరు అధికార పార్టీ నేతలను నిలదీస్తారనే భయంతోనే ఈ చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పామర్రులో అధికార పార్టీ కార్యక్రమంలా సభ నిర్వహించటాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే కల్పన సభ నుంచి వెళ్లిపోయారు. జన్మభూమి కమిటీ సభ్యులు అవకతవకలకు పాల్పడుతున్నారని, ఈ కమిటీలను రద్దు చేయాలని తిరువూరు సభలో ఎమ్మెల్యే రక్షణనిధి డిమాండ్ చేశారు. తెలుగు తమ్ముళ్లు వేదికపైకి ఎక్కి ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. జిల్లాలో వివిధ పథకాల అమలులో జన్మభూమి కమిటీ సభ్యుల పనితీరుపై విపక్షాలతో పాటు పాలకపక్ష సభ్యులు కూడా విమర్శలకు దిగటం విశేషం.
అంతా కనికట్టు
Published Wed, Jan 13 2016 2:09 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement