త్వరలో పంచాయతీల కంప్యూటరీకరణ | Computerization of panchayats soon | Sakshi
Sakshi News home page

త్వరలో పంచాయతీల కంప్యూటరీకరణ

Published Sun, Sep 22 2013 3:01 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

Computerization of panchayats soon

 హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : కేంద్ర ప్రభుత్వం రాజీవ్ పంచాయతీ స్వశక్తి అభియాన్ పథకం అమలుకు శ్రీకారం చుట్టిందని పంచాయతీ రాజ్ కమిషనర్ వరప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా గ్రామపంచాయతీలకు సంబంధించిన అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ మేరకు భవన నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని... ఈ  పథకం కింద ప్రతి మండలం, జిల్లా స్థాయిలో రీసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

హసన్‌పర్తిలోని సాంస్కృతి విహార్‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న గ్రామసర్పంచ్‌ల శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ముఖ్య అతిథిగా వరప్రసాద్ మాట్లాడుతూ... గ్రామపంచాయతీలకు  సకాలంలో ఎన్నికల జరగకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులు పూర్తిగా ఆగిపోయూయన్నారు. ఎన్నికలు  జరిగిన దృష్టా పంచాయతీలకు త్వరలోనే నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా తొలి విడతలో ఐదు వేల పంచాయతీలను కంప్యూటరీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలకు సంబంధించిన సమాచారాన్ని ఎక్కడి నుంచైనా పొందే అవకాశముంటుందని వివరించారు.  గ్రామసభలకు 17 శాఖలకు సంబంధించిన అధికారులు విధిగా హాజరు కావాలన్నారు. అధికారులు హాజరుకానిపక్షంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని సర్పంచ్‌లకు సూచించారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని, వచ్చే నెల మూడో తేదీన గ్రామసభ నిర్వహించి అందుకు సంబంధించిన సమాచారాన్ని పంపించాలన్నారు.

సర్పంచ్‌లు ప్రజల కోసం ఆలోచించాలి : కలెక్టర్ కిషన్

 సర్పంచ్‌లు తమ గురించి కాకుండా ప్రజల కోసం ఆలోచించాలని కలెక్టర్ కిషన్ సూచించారు.  గ్రామానికి ఏ పథకం వర్తించినా... పంచాయతీ తీర్మానం అవసరమన్నారు. తీర్మానం లేకుండా ఎవరికైనా పథకం వర్తింపజేస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బైఫరికేషన్ అయిన పంచాయతీలకు వెంటనే ఆ పరిధికి సంబంధించిన నిధులను వారి ఖాతాల్లో జమ  చేయాలని ఆదేశించారు.  గ్రామాల్లో ఏమైనా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావొచ్చన్నారు.   జిల్లాలోని 962 పంచాయతీ సర్పంచ్‌లకు త్వరలో సిమ్ కార్డులు అందజేస్తామని వివరించారు. దీంతో జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన అధికారులతో సర్పంచ్‌లతో ఉచితంగా మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు.

 మూడు నెలలకోసారి ములాఖత్...

 ప్రతి మూడు నెలలకోసారి జిల్లాలోని అన్ని పంచాయతీ సర్పంచ్‌లతో ములాఖత్ అవుతానని కలెక్టర్ తెలిపారు.  త్వరలోనే డివిజన్, మండలస్థాయిల్లో సర్పంచ్‌ల శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.  సర్పంచ్‌లకు పునఃశ్చరణ తరగతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఏమైనా సమస్యలు తలెత్తితే టోల్‌ఫ్రీ నంబర్‌కు మెసేజ్ పంపించాలని సూచించారు.

 రూ. 10 వేల గౌరవ వేతనం చెల్లించాలి : నూతన సర్పంచ్‌ల విజ్ఞప్తి

 తమకు రూ. 10వేల గౌరవ వేతనం అందించాలని  కమిషనర్‌కు నూతన సర్పం చ్‌లు విజ్ఞప్తి చేశారు.  కార్యదర్శులతో సంబంధం లేకుండా  చెక్ పవర్‌ను తమకే ఇవ్వాలని కోరారు. ఒక్కో కార్యదర్శి నాలుగైదు పంచాయతీలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తుండడంతో పాలన అస్తవ్యస్తంగా మారిందని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం శిక్షణ పొందిన సర్పంచ్‌లకు కమిషనర్ సర్టిఫికెట్లు అందజేశారు. పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రామారావు, జిల్లా పరిషత్ సీఈఓ ఆంజనేయులు, డీపీఓ ఇస్లావత్‌నాయక్,  మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజాత్రివిక్రమ్  పాల్గొన్నారు.

 పల్లెసీమలను అభివృద్ధి చేసే భాగ్యం సర్పంచ్‌లదే..
.
 కాజీపేట : ప్రజలు అందించిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాజకీయపార్టీలకతీతంగా పల్లెసీమల అభివృద్ధికి కృషిచేసే భాగ్యం ఒక సర్పంచ్‌లకే దక్కుతుందని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ వరప్రసాద్ అన్నారు. ఫాతిమానగర్ దివ్యదీప్తి భవన్‌లో ఏఎంఆర్-ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ది అకాడమీ ఆధ్వర్యంలో  మూడు రోజులుగా జరుగుతున్న గ్రామపంచాయతీ మహిళ సర్పంచ్‌ల శిక్షణ శిబిరంలో  శనివారం సాయంత్రం ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.ప్రభుత్వ నిధుల మంజూరుపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు. స్థానికంగా నిధుల సమీకరణకు వీలైనంత మేరకు ప్రయత్నించాలని... పన్నుల వసూళ్లలో రాజీపడితే అభివృద్ధిలో వెనుకబడిపోవడం ఖాయమన్నారు. కలెక్టర్ జి.కిషన్‌తోపాటు ఎంపీడీఓలు వీరచంద్రం, వసుమతి, అడిట్ అధికారి రమాదేవి, ఈఓపీఆర్‌డీ రవీందర్‌రెడ్డి, ఎన్‌జీఓ హరికుమారి హాజరయ్యూరు. ఆత్మకూర్, చిట్యాల, హన్మకొండ, గీసుగొండ, హసన్‌పర్తి, పరకాల, సంగెం మండలాలకు చెందిన మహిళా సర్పంచ్‌లు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement