ఎవరు లోకల్.. ఎవరు నాన్‌లోకల్!?
విద్యార్థుల స్థానికత నిర్ధారణలో గందరగోళం
హైదరాబాద్: ఒక విద్యార్థి బీటెక్‌లో చేరాలంటే.. అతని ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం నుంచి గడిచిన ఏడేళ్లలో (ఇంటర్ నుంచి 6వ తరగతి వరకు) వరుసగా నాలుగేళ్లు ఎక ్కడ చదివితే అక్కడి విద్యాప్రవేశాల్లో లోకల్ అభ్యర్థిగా పరిగణిస్తారు. అదే ఆ ఏడేళ్ల విద్యాభ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి చేసి, తెలంగాణలోని కాలేజీలో బీటెక్‌లో చేరాలంటే 15 శాతం ఓపెన్ కోటాలో నాన్‌లోకల్ అభ్యర్థిగానే చేరాలి. ఇదీ ప్రస్తుతం విద్యా ప్రవేశాల్లో అమలు చేస్తున్న నిబంధన. పదేళ్ల పాటు ఇదే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం చెబుతోంది. అయితే నాన్‌లోకల్ అభ్యర్థిగానే తెలంగాణలో బీటెక్ పూర్తి చేసిన సదరు విద్యార్థి ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎంటెక్‌లో చేరేందుకు వెళ్లేప్పుడు మాత్రం తెలంగాణలో లోకల్ అభ్యర్థి అవుతున్నాడు. అదెలాగంటే.. గడిచిన ఏడేళ్లలో (బీటెక్ నుంచి 9వ తరగతి వరకు) బీటెక్ కోర్సు కాలవ్యవధే నాలుగేళ్లు. వరుసగా ఆ నాలుగేళ్లు తెలంగాణలోనే చదివాడు కాబట్టి ఎంటెక్‌లో అతన్ని లోకల్ అభ్యర్థిగా చేర్చుకోవాల్సిందే. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం అదే. ఇప్పటివరకు జరిగిన ప్రవేశాలన్నీ అలాగే జరిగాయి. ఇలా అనేకమంది విద్యా సంస్థల్లో ప్రవేశాల విషయంలో నాన్‌లోకల్ నుంచి లోకల్ స్టేటస్‌కు మారుతున్నారు.
బీటెక్, ఎంటెక్‌లే కాదు...
ఒక్క బీటెక్‌లో మాత్రమే కాదు.. ఇతర ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర డిగ్రీ కోర్సుల్లోనూ ఇలా చదువుతున్న వారు ఉన్నారు. పాఠశాల విద్యలో కొన్ని తరగతులు ఆంధ్రప్రదేశ్‌లో, మరికొన్ని తరగతులు తెలంగాణలో చదివిన వారు ఉన్నారు. తెలంగాణలో చదువుతున్న వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇలాంటి విద్యార్థులు అనేక మంది ఉన్నారు. మరి వారికి తెలంగాణ ప్రభుత్వం ఎంటెక్‌లో స్థానికులుగా గుర్తిస్తుందా? ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘ప్రస్తుతం ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని అమలు చేస్తాం. తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వర్తింపజేస్తాం. ఇతర రాష్ట్ర విద్యార్థులకు ఫీజులను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వదు’ అని ప్రభుత్వం తమ విధానాన్ని స్పష్టం చేసింది. దీని ప్రకారం తెలంగాణలో బీటెక్ చదివే ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల ఫీజును అక్కడి ప్రభుత్వం భరిస్తే... అదే విద్యార్థులు పోస్టు గ్రాడ్యుయేషన్‌కు వ చ్చే సరికి తెలంగాణలో స్థానికులు అవుతున్నందున వారి ఫీజును తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందా? లేదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో చదువుతున్న వారు, భవిష్యత్తులో చదువుకోబోయే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం ఎలా ఉంటుందనే ఆసక్తి తల్లిదండ్రుల్లో వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో అధికారుల్లోనూ స్పష్టత లేదు. నిబంధనలు ఎలా ఉండాలన్న విషయంపై వారు తలలు పట్టుకుంటున్నారు.
చర్చనీయాంశంగా స్థానికత..
రాష్ట్ర విభ జన నేపథ్యంలో స్థానికతకు ప్రామాణికతపై అధికారుల్లోనే సందేహాలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల విషయంలో స్థానికత నిర్ధారణ అనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిబంధనలతో ఉత్తర్వులు జారీ చేస్తుందనే అంశంపై తల్లిదండ్రుల్లో ఆసక్తి నెలకొంది. క్వాలిఫైయింగ్ పరీక్షకు ముందు చదివిన ఏడేళ్ల విద్యలో నాలుగేళ్లను పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా పాఠశాల విద్యను ఎక్కడ పూర్తి చేశారనే అంశం ఆధారంగా స్థానికతను నిర్ధారిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే. మరోవైపు ఉద్యోగాల భర్తీ విషయంలో.. పాఠశాల విద్యలో నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు ఎక్కడ ఎక్కువ కాలం చదివితే ఆ ప్రాంతానికి వారిని లోకల్‌గా పరిగణనలోకి తీసుకోవడం గమనార్హం.