పుట్టిన గడ్డకు తీరని అన్యాయం జరుగుతున్నా.. ప్రజలు ఛీత్కరించుకుంటున్నా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాత్రం పదవుల్ని వదలడం లేదు. పదవుల్ని విడిచి ఉద్యమంలోకి రావాలంటూ ఉద్యోగులు, విద్యార్థులతోపాటు అన్నివర్గాల వారూ మొదటి నుంచీ కోరుతున్నా.. ‘అబ్బే.. విభజన జరగదు..’ అంటూ కాంగ్రెస్ నేతలు తప్పించుకుంటూనే వచ్చారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
పుట్టిన గడ్డకు తీరని అన్యాయం జరుగుతున్నా.. ప్రజలు ఛీత్కరించుకుంటున్నా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాత్రం పదవుల్ని వదలడం లేదు. పదవుల్ని విడిచి ఉద్యమంలోకి రావాలంటూ ఉద్యోగులు, విద్యార్థులతోపాటు అన్నివర్గాల వారూ మొదటి నుంచీ కోరుతున్నా.. ‘అబ్బే.. విభజన జరగదు..’ అంటూ కాంగ్రెస్ నేతలు తప్పించుకుంటూనే వచ్చారు. పదవుల్లో ఉంటేనే సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పిన నాయకులంతా తాజా పరిణామాలతో నోరు మెదపడానికి కూడా సాహసించడంలేదు. కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేసి ఉంటే కాంగ్రెస్ అధిష్టానం విభజన విషయంలో వెనక్కి తగ్గి ఉండేదనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది.
ఎన్జీవోలు, ఉపాధ్యాయులు, వ్యాపార వర్గాలు సైతం ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామాలు చేస్తే విభజనకు బ్రేక్ పడుతుందనే ఉద్దేశంతో పదేపదే అదే డిమాండ్ చేస్తూ వచ్చారు. ప్రజాప్రతినిధులు కనిపించినప్పుడల్లా ఘెరావ్ చేశారు. అయినా కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కుంటిసాకులు చెప్పి తప్పించుకున్నారు. కేంద్ర మంత్రివర్గం రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఆమోదం తెలిపిన తర్వాత కూడా ప్రజాప్రతినిధులు అదే ధోరణితో వ్యవహరిస్తుండటంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
సమైక్యమని చెప్పి.. రూటు మార్చేశారు : గతంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు కేంద్రమంత్రి పదవి దక్కగానే రూటు మార్చిన విషయం తెలిసిందే. విభజన నిర్ణయానికి కొద్దిరోజుల ముందే కేంద్రం ఆయనకు పదవి కట్టబెట్టింది. అంతకుముందు ఢిల్లీలో కొద్దోగొప్పో ఆయన మాట చెల్లుబాటయ్యేది. పదవి ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను పట్టించుకోవడం మానేసింది. విభజనకు అంగీకరించినందుకే ఆయనకు పదవి ఇచ్చినట్లు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా రాష్ట్రాన్ని విడగొట్టే ప్రయత్నాలు ముమ్మరమైనా కావూరి పదవిని వదల్లేదు. ఏవేవో కబుర్లు చెబుతూ కాలం గడిపారు. చివరకు విభజనకు అంగీకరిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించి, హైదరాబాద్‌ను యూటీ చేయాలనే డిమాండ్‌ను వినిపించారు.
మొన్నటి కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఏకంగా రాయల తెలంగాణ ఇవ్వాలని గట్టిగా వాదించారు. దీంతో ఆయనపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం రెట్టింపరుు్యంది. పదవిని పట్టుకుని వేలాడుతూ ప్రజల భావోద్వేగాలు, వారి అభిప్రాయూలతో సంబంధం లేకుండా రకరకాల వ్యాఖ్యానాలు చేసిన కావూరి పేరు చెబితేనే జనం మండిపడుతున్నారు. కేంద్రం విభజనకు అధికారికంగా ఆమోదం తెలిపిన తర్వాత కూడా మంత్రి పదవికి రాజీనామా చేయడానికి ఆయన ఇష్టపడటం లేదని కావూరి అనుచరులు చెబుతున్నారు. కేంద్ర కేబినెట్ సమావేశానికి ముందు జరిగిన ఎంపీల సమావేశంలోను రాజీనామా చేయడానికి ఆయన ఇష్టపడలేదని చెబుతున్నారు.
కనుమూరి దాగుడుమూతలు : నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు సైతం పదవికి రాజీనామా చేసే విషయమై దాగుడుమూతలు అడుతూనే ఉన్నారు. ప్రతిచోటా ఆయన్ను అడ్డుకున్నా పదవిని అంటిపెట్టుకునే ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం తారస్థాయికి చేరుకున్న తర్వాత రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. లోక్‌సభ స్పీకర్ రాజీనామాలను ఆమోదించరని తెలిసిన తర్వాతే ఆయన ఆ పనిచేశారు. విభజనను కేంద్రం ఆమోదించిన తర్వాత కూడా ఆయన పదవే ప్రాణంగా వ్యవహరిస్తున్నారు.
మంత్రులదీ అదే దారి.. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, వట్టి వసంత్‌కుమార్ వ్యవహార శైలి కూడా అదే రీతిలో ఉంది.
వట్టి వసంత్‌కుమార్ అయితే దీని గురించి మాట్లాడటానికే ఒప్పుకోవడం లేదు. ఇప్పటివరకూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై స్పందించలేదు. అవసరమైనప్పుడు రాజీనామా చేస్తానని గతంలో చెప్పిన ఆయన ఇప్పుడేం చేస్తామనేది బయటకు చెప్పడం లేదు. పితాని సత్యనారాయణ గతంలో ఉత్తుత్తి రాజీ నామా చేసి చేతులు దులుపుకున్నారు. యథావిధిగా పదవిలో కొనసాతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలోనూ ఆయన ఇంకా ప్రజలను మభ్యపెట్టే మాటలనే వల్లిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసాపురం, పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేలు కూడా గతంలో ఉత్తుత్తి రాజీనామాలతో జనాన్ని తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు కూడా పదవులను పట్టుకుని వేలాడుతూనే ఉన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే కేంద్రం ఇంత ధైర్యంగా ముందుకు వెళ్లేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కావూరి వంటి కేంద్ర మంత్రులు, ఇతర ఎంపీలు సీరియస్‌గా రాజీనామాలు చేసినా సోనియాగాంధీ పునరాలోచనలో పడే అవకాశం ఉండేది. అయితే వీరెవరూ పదవులను వదలకపోవడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ఈ తరుణంలోనూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కల్లబొల్లి కబుర్లు, మాయమాటలతో కాలక్షేపం చేస్తూనే ఉండటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.