
ఉద్యమమే ఊపిరిగా..
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ 58వ రోజూ సీమాంధ్రలో ఉద్యమం జోరు కొనసాగింది. రాష్ర్ట విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదంటూ ఊరూవాడ ఏకమై నినదిస్తోంది.
సాక్షి,నెట్‌వర్క్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ 58వ రోజూ సీమాంధ్రలో ఉద్యమం జోరు కొనసాగింది. రాష్ర్ట విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదంటూ ఊరూవాడ ఏకమై నినదిస్తోంది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మానవహారాలు, రిలేదీక్షలు, రాస్తారోకోలు, వంటావార్పు నిర్వహించారు. అనంతపురంలో ఏపీఎన్జీవోలు, గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు రక్తంతో సంతకాలు చేశారు. ఉపాధ్యాయులు భిక్షాటన చేయగా, బుడజంగాలు మానవహారం నిర్మించారు. ఎస్కేయూ వద్ద 205 జాతీయ రహదారిపై వర్సిటీ పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. నా రక్తం సమైక్యాంధ్ర కోసం అనే నినాదంతో కర్నూలులో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆత్మకూరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటికి టులెట్ బోర్డు తగిలించారు.
ఆదోనిలో ప్రజాకోర్టు నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా బద్వేలులో విద్యార్థులు 58 సంఖ్య ఆకారంలో నాలుగురోడ్ల కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. తిరుపతిలో వెటర్నరీ కళాశాల సిబ్బంది కోయవేషాలు ధరించి, గిరిజన సంప్రదాయ నృత్యాలతో నిరసన తెలిపారు. మున్సిపల్ కార్యాలయం వద్ద మహిళా ఉద్యోగులు రోడ్డుపై గొబ్బెమ్మలు పెట్టి, సంక్రాంతి సంబరాలు జరిపారు. చిత్తూరులో విద్యార్థులు సేవ్ ఆంధ్రప్రదేశ్ ఆకారంలో కూర్చుని సమైక్య నినాదాలు చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలన్నీ ఈనెల 23నుంచి బంద్ పాటిస్తున్నా గీతం వర్సిటీలో తరగతులు నిర్వహించడాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు యూనివర్సిటీ గేట్లఎదుట బైఠాయిం చారు. తూర్పుగోదావరిజిల్లా సామర్లకోటలో మంత్రి తోట నరసింహంను సమైక్యవాదులు అడ్డగించారు. రాష్ట్ర విభజన నిర్ణయం మా భవిష్యత్తును కాలరాస్తుందంటూ చిన్నారులు రాజమండ్రిలో ‘బాలఘోష’ నిర్వహించారు. విజయనగరం జిల్లా గంటాడ్యలో రైతుగర్జన పేరుతో రైతులు వంద ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు జెడ్పీ కార్యాలయం వద్ద ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనను ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంతో పోలుస్తూ ఓ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. శ్రీకాకుళంలోని మంగువారితోటకు చెందిన మహిళలు ముర్రాటలతో నిరసన తెలిపారు.
టెక్కలిలో మోదిగపాడు రైతులు భారీర్యాలీ నిర్వహించారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన మెళియాపుట్టిలో గిరజన గర్జన నిర్వహించారు. గుంటూరు జిల్లా తెనాలిలో జేఏసీ నాయకులు వీధుల్లో భిక్షాటన చేశారు. విజయవాడలోని అన్ని రైతు బజార్ల సిబ్బంది, రైతులు కూరగాయల దండలు ధరించి భారీ ప్రదర్శన నిర్వహించారు. నెల్లూరులో దీక్ష శిబిరంలో ఆర్టీసీ స్క్వాడ్ అధికారి సోమశేఖర్‌రాజు మృతికి సంతాపంగా జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా బంద్ జరిగింది. 58రోజుల నుంచి వేతనాలు లేకుండా ఉద్యమం సాగి స్తున్న ఇరిగేషన్ శాఖ ఉద్యోగులకు ఒక్కొక్కరికి పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ 20 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని రాజీనామా చేయాలంటూ ఒంగోలులో ఘెరావ్ చేశారు.
విభజన ఆందోళనతో సమైక్యవాది మృతి
సమైక్యాంధ్ర ఉద్యమ దృశ్యాలను టీవీలో చూస్తూ వైఎస్సార్‌జిల్లా పులివెందులలోని భాకరాపురానికి చెందిన గడ్డం నాగేశ్వరరావు(35)గురువారం గుండెపోటుకు గురై మరణించారు.