రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుంటే సొంత పార్టీ నేతలు కొందరు నోరు మెదపడం లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సీఎం హోదాలో చేసిన సమైక్యాంధ్ర అనుకూల వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెర తీశాయి.
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుంటే సొంత పార్టీ నేతలు కొందరు నోరు మెదపడం లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సీఎం హోదాలో చేసిన సమైక్యాంధ్ర అనుకూల వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెర తీశాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఉటంకిస్తూ జిల్లాలో తెలంగాణవాదులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కిరణ్ దిష్టిబొమ్మలు దహనం చేయడంతోపాటు ఆయనకు సద్బుద్ధి ప్రసాదించాలని అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించారు. ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఒంటికాలుపై లేచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవరోధాలు కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. డీసీసీ అధ్యక్షుడు సి.రాంచద్రారెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు సీఎం వ్యాఖ్యలను ఖండించారు. సొంత పార్టీతోపాటు టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐలతోపాటు విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీలు తీవ్రంగా స్పందిస్తుండగా కాంగ్రెస్ పార్టీ, సీఎం లాబీయింగ్‌లో కీలకంగా ఉన్న నేతలు మాత్రం మౌనంగా ఉంటుండటం దేనికి సంకేతమన్న చర్చ సాగుతోంది.
సీఎం వ్యాఖ్యలపై ప్రేంసాగర్‌రావు, ఆయన వర్గం మౌనం
సీఎం కిరణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు మౌనం వహించడం వెనుక మర్మం ఏమిటన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుకునే ప్రతీ ఒక్కరిలో ప్రేంసాగర్, ఆయన అనుచరవర్గం అనుసరిస్తున్న తీరు అనుమానాలను రేకెత్తిస్తుంది. సొంతపార్టీకి చెందిన ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, సీఆర్‌ఆర్, దివాకర్‌రావు సీఎం తీరును ఎండగట్టగా, ప్రేంసాగర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్‌రెడ్డి తదితరులు మౌనం వహించడం తెలంగాణ వాదులను ఆలోచింప చేస్తోంది. గతంలోను జిల్లాలో సకల జనుల సమ్మె ఉధృతంగా సాగుతున్న సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న ప్రేంసాగర్‌రావు జిల్లా నుంచి సుమారు 1000 మందిని తీసుకెళ్లి సీఎం కిరణ్‌కుమార్‌కు అభినందనలు తెలపడం కూడా వివాదాస్పదమైంది.
రూపాయి కిలో బియ్యం పథకం ప్రకటించిన నేపథ్యంలో సీఎంను అభినందించేందుకు వెళ్లిన ఆయన తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న వారికి ఏం సంకేతాలిచిన్నట్లన్న చర్చ అప్పట్లో జరిగింది. ఎమ్మెల్యే సక్కు, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ సిడాం గణపతి, డీసీసీ రేసులో ఉన్న జాదవ్ అనిల్‌కుమార్‌లతోపాటు ఎవరూ కూడా సీఎం వ్యాఖ్యలపై స్పందించలేదని, వారి అనుచరులను నోరు మెదపనివ్వడం లేదన్న చర్చ బహిరంగంగానే సాగుతోంది.ఏదేమైనా సీఎం వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా భగ్గుమంటున్న తరుణంలో తెలంగాణవాదులుగా పలువురు నేతలు స్పందించని వైనం తెలంగాణవాదులు, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.