చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఉంది మన జిల్లా నేతల రాజీనామాల పర్వం. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయ్యేవరకూ అధికార పీఠాన్ని వదలకుండా ఆఖరి నిముషం వరకూ పైరవీలు, పనులు చేసుకున్న అమాత్యులు మంగళవారం రాజీనామా అస్త్రాలను సంధించారు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఉంది మన జిల్లా నేతల రాజీనామాల పర్వం. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయ్యేవరకూ అధికార పీఠాన్ని వదలకుండా ఆఖరి నిముషం వరకూ పైరవీలు, పనులు చేసుకున్న అమాత్యులు మంగళవారం రాజీనామా అస్త్రాలను సంధించారు. విశాఖ లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి పురందేశ్వరి,అనకాపల్లి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావులు కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. గంటాతో పాటు పీఆర్‌పీ నుంచి కాంగ్రెసుకు వచ్చిన పంచకర్ల రమేష్‌బాబు(పెందుర్తి), ముత్తంశెట్టి శ్రీనివాస్ (భీమిలి), చింతలపూడి వెంకట్రామయ్య(గాజువాక) కూడా అదే బాట పట్టారు. యలమంచలి శాసనభ్యుడు యూవీ రమణమూర్తి (కన్నబాబు) తాను కూడా పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర విభజన అంశంపై తాను రాజీనామా చేయనని గతంలో చెప్పిన పురందేశ్వరి మరో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకొని మంగళవారం రాత్రి కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించారని తెలిసింది.
రాష్ట్ర మంత్రి గంటా మాత్రం రాజీనామా విషయంలో ఆదినుంచి ఊగిసలాడుతూ వచ్చారు. విభజన ప్రకటన చేస్తే చాలు మంత్రి పదవిని వదిలేస్తానని ఆర్నెళ్ల క్రితం హడావుడి చేసిన గంటా తరువాత అదిగో..ఇదిగో అంటూ కాలయాపన చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి సన్నిహితుడిగా ముద్ర పడిన ఈ నాయకుడు సమైక్య ముసుగులో తమను వంచించారని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. పాయకరావుపేటలో ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన కూడా చేపట్టారు. రెండు రోజుల క్రితం పలు నామినేటెడ్ పదవులకు సిఫార్సులు చేసిన గంటా, ఎంవీపీ కాలనీలో వుడా చేపడుతున్న ఆడిటోరియానికి శంకుస్ధాపన కూడా చేశారు. విశాఖ డెయిరీలో సోలార్ ప్రాజెక్టును ప్రారంభించారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాక కూడా సమైక్యవాదులను మభ్యపెట్టి పనులు పూర్తి చేసుకొన్న ఆయన మంగళవారం కాస్త తెలివిగా అందరికంటే ముందుగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరో అడుగు ముందుకేసి అనకాపల్లిలోని తన కార్యాలయం వద్ద ఉన్న సోనియా ఫ్లైక్సీలను తనవర్గీయులతోనే తగలపెట్టించారనే విమర్శలున్నాయి. విశాఖలో తెలుగుతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు గంటా ఏర్పాట్లుచేసుకొన్నప్పటికీ ఏయూ విద్యార్ధుల ఆందోళన కారణంగా వాయిదా పడింది. విద్యార్ధులు మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడంతో గంటా వెనకడుగువేశారు.
రాజీనామా చేసిన కొనసాగుతున్న ప్రొటోకాల్..
మంత్రిగా గంటా శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం రాజీనామా చేసిన తరువాత కూడా ప్రొటోకాల్ కొనసాగింది. ఢిల్లీ నుంచి రాజీనామా లేఖను గవర్నర్‌కు ఫ్యాక్స్ చేసిన విమానంలో విశాఖ వచ్చిన ఆయనకు ప్రొటోకాల్ ప్రకారమే అధికారులు స్వాగతం పలికారు. బల్బుకారులో, ప్రభుత్వం సమకూర్చిన సెక్యూరిటీ, సహాయకులతో కలసే ఇంటికి వెళ్లారు.