గెలుపు కోసం అధికార పార్టీ నేతలు తొక్కని అడ్డదారి లేదు. మన అనుకున్న వారి కోసం ఎవరి పొట్ట కొట్టేందుకైనా వెనుకాడటం లేదు. నాలుగు ఓట్లు వస్తాయంటే.. ఎంతకైనా తెగబడుతున్నారు. అవతలి వ్యక్తులు నిరుపేదలైనా.. రైతులైనా వారికి అనవసరం. ఏమాత్రం జాలి చూపక వీధినపడేస్తున్నారు. ఈ కోవలోనే ఓ మంత్రి రైతుల పొట్టకొట్టి అనుచరగణం ‘ఇల్లు చక్కబెట్టే’ పనిలో తలమునకలవుతున్నారు.
సాక్షి, కర్నూలు: కోడుమూరు నియోజకవర్గం కర్నూలు రూరల్ మండలంలోని రుద్రవరం గ్రామంలో 243 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కొన్నేళ్లుగా ఈ భూములను సాగు చేసుకుంటున్న 60 మంది రైతులను గుర్తించిన ప్రభుత్వం 110 ఎకరాలకు పట్టాలు పంపిణీ చేసింది. మరో 66 ఎకరాలను రైతులు అనధికారికంగా సాగు చేసుకుంటున్నారు. మిగిలిన భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అయితే రచ్చబండ-1 కింద ఇళ్ల పట్టాల కోసం వచ్చిన 19,634 దరఖాస్తుల్లో తడకనపల్లిలోని 200 ఎకరాల్లో 5,245 మందికి, రుద్రవరం గ్రామ పరిధిలోని 507/ఏ, 605, 652, 671, 681 సర్వే నంబర్లలో ఉన్న 243 ఎకరాల్లో మరో 7,700 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. భూ పంపిణీలో రైతులకిచ్చిన భూములను డీలిస్ట్ కింద నష్టపరిహారం చెల్లించి స్వాధీనం చేసుకునేందుకు తెరలేపారు. ఆ మేరకు డిసెంబర్ 2012లో సుమారు 2,500 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
తన నియోజకవర్గ పరిధిలో తనకు తెలియకుండా పట్టాలు ఎలా పంపిణీ చేస్తారంటూ స్థానిక ఎమ్మెల్యే మురళీకృష్ణ మంత్రి టీజీ, అధికారులపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేయడంతో అప్పట్లో మిగిలిన వారికి పట్టాలు పంపిణీ చేయలేకపోయారు. ఇదంతా పక్కనపెడితే.. సాగులోని పొలాలను డీలిస్ట్ చేసిన విషయం సంబంధిత రైతులకే తెలియకపోవడం గమనార్హం. తాజాగా ఎన్నికలు సమీపిస్తుండటంతో పట్టాల పంపిణీ విషయమై అధికారులపై నేతల ఒత్తిడి అధికమైంది. గతంలో పంపిణీ చేయగా మిగిలిన భూమిలో పట్టాల పంపిణీకి మంత్రి టీజీ సన్నాహాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అదేవిధంగా గ్రామంలోని 606/1 సర్వే నంబర్‌లో పేద రైతుల ఆధీనంలోని సుమారు 300 ఎకరాలను కూడా డీలిస్ట్ చేసి ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఎన్నికల స్టంట్: ఎస్వీ మోహన్ రెడ్డి
పేదలకు పంపిణీ చేసిన భూములను లేఔట్లు వేయకుండానే ఆగమేఘాలపై ఇతరులకు ఇళ్ల పట్టాలుగా పంచి పెట్టడం ఎన్నికల స్టంటేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన రుద్రవరం గ్రామాన్ని సందర్శించి బాధిత రైతులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ నాయకులకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులపై కోర్టుకు వెళ్తామన్నారు. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా విధులు నిర్వర్తిస్తున్న రెవెన్యూ అధికారులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ వారికి అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు.
అన్యాయం చేయొద్దు: బి.అయ్యస్వామి, రైతు
మా కుంటుంబం 50 ఏళ్లుగా ఇక్కడి భూములను సాగు చేసుకుంటోంది. మా అన్నకు 8.2 ఎకరాలు, నాకు 1.53 ఎకరాలు ఉంది. అసైన్డ్ భూముల్లో సాగులోని రైతులకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసింది. మంత్రి టీజీ వెంకటేష్ ఈ భూములను ఇళ్ల పట్టాలుగా పంచిపెట్టిన విషయం మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. రాజకీయ నాయకుల మెప్పు కోసం అధికారులు మోసపూరితంగా వ్యవహరించడం తగదు.
అంతా కుట్రపూరితం: చిన్న యల్లయ్య, రైతు
రుద్రవరం గ్రామంలోని 507/ఏ సర్వే నంబరులో 1.40 ఎకరాలు సాగు చేస్తున్నాం. దీనిపైనే మా కుటుంబం ఆధారపడింది. ఒక్కోసారి దిగుబడి లేక నష్టాలు చవిచూశాను. ఏడాదిన్నర కిందట పంట నష్టం కింద పరిహారం వస్తుందంటూ వీఆర్వో కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడు. అది మా భూమిని కాజేసే పన్నాగమని తెలుసుకోలేకపోయాం. భూములను లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదు.
అనుచరులకు కట్టబెట్టి!
Published Thu, Feb 13 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM
Advertisement
Advertisement